ఇషాంత్ చోటు పదిలం

21 Oct, 2013 01:04 IST|Sakshi
ఇషాంత్ చోటు పదిలం

ముంబై: మూడో వన్డేలో భారత జట్టు ఓటమికి కారణమైన పేసర్ ఇషాంత్ శర్మపై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన నాలుగు వన్డేలకు భారత జట్టును ఆదివారం ప్రకటించారు. అయితే జట్టులో ఒక్క మార్పు కూడా చేయకుండా ఇప్పటిదాకా కొనసాగిన జట్టునే ఎంపిక చేయడం విశేషం. జట్టు సభ్యుల పేర్లను  బీసీసీఐ ట్విట్టర్‌లో ఉంచింది. అన్ని మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన ఇషాంత్‌పై కచ్చితంగా వేటు ఉంటుందని అందరూ భావించినా తన స్థానాన్ని నిలుపుకోగలిగాడు. మొహాలీ వన్డేలో అతను ఎనిమిది ఓవర్లలో ఓ వికెట్ పడగొట్టి 63 పరుగులు సమర్పించుకున్నాడు.
 
  చివర్లో ఒకే ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు ఇచ్చి జట్టు ఓటమికి కారకుడయ్యాడు. తొలి రెండు వన్డేల్లోనూ అతడి ఎకానమీ రేట్ 7.77గా ఉండడం గమనార్హం. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడం భారత బౌలర్లకు సమస్యగా మారింది. ధారాళంగా పరుగులు ఇస్తుండడంతో జట్టు ఓటమి పాలవుతోంది. ఒక్క భువనేశ్వర్ మాత్రమే రాణిస్తున్నాడు. జట్టులో ఉన్న ఇతర పేసర్లు మహ్మద్ షమీ, ఉనాద్కట్‌లకు ఇప్పటిదాకా అవకాశం దొరకలేదు. ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్ ఈనెల 23న రాంచీలో జరుగుతుంది.  
 
 భారత జట్టు: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, వినయ్, ఇషాంత్, ఉనాద్కట్, షమీ, రాయుడు, మిశ్రా.
 

మరిన్ని వార్తలు