ఇషాంత్‌ అవుట్‌

29 Feb, 2020 03:20 IST|Sakshi
క్రైస్ట్‌చర్చ్‌లో ప్రాక్టీస్‌ తర్వాత ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై జడేజా

తుది జట్టులోకి ఉమేశ్‌ యాదవ్‌!

పృథ్వీ షా ఫిట్, అశ్విన్‌ స్థానంలో జడేజా 

క్రైస్ట్‌చర్చ్‌: కివీస్‌ పర్యటనలో ఆఖరి పోరుకు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ గాయపడ్డాడు. అతని కుడి చీలమండకు గాయం కావడంతో రెండో టెస్టుకు అతను అందుబాటులో లేకుండా పోయాడు. ఇతని స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ బరిలోకి దిగే అవకాశముంది. ఇషాంత్‌కు అయిన గాయం కొత్తదేం కాదు. జనవరిలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో గాయపడ్డాడు. అప్పుడే అతను కివీస్‌ పర్యటనకు అనుమానమేనని వార్తలొచ్చాయి. అయితే చక్కటి ఫామ్‌లో ఉన్న ఇషాంత్‌ను... వేగంగా కోలుకున్నాడనే కారణంతో టెస్టు జట్టులోకి తీసుకున్నారు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశించినట్లుగానే తొలిటెస్టులో ఇషాంత్‌ (5/68) రాణించాడు.

బ్యాటింగ్‌ వైఫల్యంతో భారత్‌ ఈ మ్యాచ్‌ ఓడింది. శుక్రవారం జట్టు సభ్యులు ప్రాక్టీసు చేస్తుండగా... అతను కూడా వచ్చాడు. కానీ అసౌకర్యంగా కనిపించడంతో నెట్‌ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో జట్టు మేనేజ్‌మెంట్‌ ముందు జాగ్రత్తగా అతని కుడి చీలమండకు స్కానింగ్‌ కూడా తీయించింది. రిపోర్టులు ప్రతికూలంగా వచ్చినట్లు సమాచారం. బౌలింగ్‌లో ఎదురుదెబ్బ తగిలినా...  బ్యాటింగ్‌లో మాత్రం యువ ఓపెనర్‌ పృథ్వీ షా ఫిట్‌నెస్‌తో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అతని ఎడమ పాదానికి అయిన వాపు మానిందని, రెండో టెస్టు ఆడతాడని భారత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి తెలిపాడు. ఫామ్‌లోలేని వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ స్థానంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ జడేజాను తీసుకునేది ఖాయమైంది. జడేజా బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు కావడంతో అతన్ని తీసుకోవాలని కోచ్‌తో పాటు కెప్టెన్‌ కోహ్లి నిర్ణయించినట్లు తెలిసింది.

బ్యాటింగ్‌ పిచ్‌!
క్రైస్ట్‌చర్చ్‌ వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. గత టెస్టులా కాకుండా ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశముంది. ఇది బ్యాట్స్‌మెన్‌కు ఊరటనిచ్చే అంశం. ప్రత్యేకించి భారత బ్యాట్స్‌మెన్‌ ఆఖరి పోరులో అదిరిపోయే ఆట ఆడేందుకు ఇది చక్కని వేదిక.

మరిన్ని వార్తలు