ఇషాంత్‌ విశ్వరూపం.. ఒకే ఓవర్లో 3వికెట్లు 

3 Aug, 2018 19:24 IST|Sakshi
ఇషాంత్‌ శర్మ

బర్మింగ్‌హామ్‌ : ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో తొలుత టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ టాపార్డర్‌ వెన్ను విరవగా.. ఆపై పేసర్‌ ఇషాంత్‌ శర్మ చెలరేగిపోయాడు. వైవిద్యమైన బంతులు సంధిస్తూ వారి సొంతగడ్డపైనే ఇంగ్లండ్‌ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. ఒకే ఓవర్లో మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు ఇషాంత్‌. ఇన్నింగ్స్‌ 30వ ఓవర్‌ వరకు  85/4గా ఉన్న ఇంగ్లండ్‌ పరిస్థితి ఆ ఓవర్‌ ముసిసేసరికి 87/7 గా మారిపోయింది. 

30వ ఓవర్‌ రెండో బంతికి నిలకడగా ఆడుతున్న కీపర్‌ జానీ బెయిర్‌స్టో (28; 40 బంతుల్లో 5 పోర్లు)ను ఔట్‌ చేశాడు. బెయిర్‌ స్టో ఆడిన బంతిని స్లిప్‌లో ఉన్న ధావన్‌ క్యాచ్‌ పట్టగా వెనుదిరిగాడు. ఆ ఓవర్లో 4వ బంతికి ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (6) కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఓవర్‌ చివరి బంతికి బట్లర్‌(1)ను ఔట్‌ చేసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు ఇషాంత్‌. బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతిని కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ క్యాచ్‌ పట్టడంతో 7వ వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు బట్లర్‌. 

మళ్లీ మొదలైన ఆట
వెలుతురు మందగించడంతో మూడో రోజు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పటికి 42 ఓవర్లాడిన ఇంగ్లండ్‌ 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఓవరాల్‌గా 144 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్‌ కొనసాగుతోంది. స్వల్ప విరామం అనంతరం ఆట మళ్లీ ప్రారంభమైంది.

మరిన్ని వార్తలు