ఎఫ్‌సీ గోవాకు షోకాజ్ నోటీసు

2 Jan, 2016 00:49 IST|Sakshi
ఎఫ్‌సీ గోవాకు షోకాజ్ నోటీసు

పణజీ: ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ఎఫ్‌సీ గోవాకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) షోకాజ్ నోటీసు జారీ చేసింది. గత నెల 20న జరిగిన ఫైనల్లో చెన్నైయిన్ ఎఫ్‌సీతో ఓడిన అనంతరం చేసిన అల్లరిపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోరాదో తెలపాల్సిందిగా అందులో కోరింది. జట్టుతో పాటు ఆటగాళ్లకు కూడా ఈమేరకు నోటీసులు పంపి ఈనెల 8లోగా సమాధానమివ్వాల్సిందిగా స్పష్టం చేసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఎఫ్‌సీ గోవా సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు, అధికారులు ఎక్విప్‌మెంట్ మేనేజర్ రాజేశ్ మాల్గి ఆధ్వర్యంలో రిఫరీని చుట్టుముట్టి ఆయన్ని భయాందోళనకు గురి చేశారని ఏఐఎఫ్‌ఎఫ్ పేర్కొంది.

జపాన్‌కు చెందిన రిఫరీలను బూతులు తిట్టడమే కాకుండా భౌతికంగా దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారని, అలాగే బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయడం కూడా నిబంధనలకు వ్యతిరేకమని తెలిపింది. మరోవైపు ఐఎస్‌ఎల్, ఏఐఎఫ్‌ఎఫ్‌ను విమర్శించడంతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన ఎఫ్‌సీ గోవా అధ్యక్షుడు దత్తరాజ్ సాల్గావ్‌కర్‌ను విడిగా వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది.

మరిన్ని వార్తలు