భారత షూటర్ల కొత్త చరిత్ర

15 Sep, 2018 04:53 IST|Sakshi
స్వర్ణాలతో రాజ్‌కన్వర్, విజయ్‌వీర్, ఆదర్శ్‌

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి మూడో స్థానం  

చాంగ్‌వాన్‌ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ కొత్త చరిత్ర లిఖించింది. గతంలో ఎన్నడు లేని విధంగా 11 స్వర్ణాలతో పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. పోటీల ముగింపు రోజు శుక్రవారం రెండు స్వర్ణాలు, ఓ రజతం భారత్‌ ఖాతాలో చేరడంతో... మొత్తంగా 27 పతకాల (11 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు)తో మూడో స్థానంతో ముగించింది. మన షూటర్లు చివరి రోజు జూనియర్‌ విభాగంలో రెండు స్వర్ణాలు... సీనియర్‌ విభాగంలో ఓ రజతం సాధించారు. జూనియర్‌ 25 మీ. పిస్టల్‌  విభాగంలో పదహారేళ్ల విజయ్‌వీర్‌ 572 పాయింట్లతో పసిడి పతకం సాధించాడు.

టీమ్‌ విభాగంలో విజయ్‌వీర్‌ (564), రాజ్‌కన్వర్‌ సింగ్‌ సంధు (564), ఆదర్శ్‌ సింగ్‌ (559)లతో కూడిన భారత జట్టు 1695 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. కొరియా (1693), చెక్‌ రిపబ్లిక్‌ (1674) వరుసగా రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నాయి. సీనియర్‌ 25 మీ. పిస్టల్‌ విభాగంలో గురుప్రీత్‌ సింగ్‌ 579 పాయింట్లతో రజతం సాధించాడు. టీమ్‌ విభాగంలో గురుప్రీత్, అమన్‌ప్రీత్‌ సింగ్, విజయ్‌ కుమార్‌లతో కూడిన భారత బృందం 1699 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.     2020 టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌గా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్‌ రెండు ఒలింపిక్‌ బెర్త్‌లను సొంతం చేసుకుంది. అంజుమ్‌ మౌద్గిల్, అపూర్వీ చండీలా 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఈ బెర్త్‌లు సాధించారు.  

మరిన్ని వార్తలు