‘కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగించండి’

25 Jul, 2019 13:21 IST|Sakshi

న్యూఢిల్లీ:  టీమిండియా ప్రధాన కోచ్‌తో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌లకు సంబంధించి క్రికెట్‌ పరిపాలక కమిటీ(సీఓఏ) ఇటీవల దరఖాస్తులకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం కోచ్‌గా ఉన్న రవిశాస్త్రిని కొనసాగించడం దాదాపు అసాధమ్యమే. కాగా, భారత క్రికెట్‌ కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగించాలనే వాదన కూడా బీసీసీఐ పెద్దల్లో వినిపిస్తోంది. రవిశాస్త్రిని కోచ్‌గా కొనసాగిస్తే అది కోహ్లి కెప్టెన్సీలో మరిన్ని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుందని సీనియర్‌ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ కోచ్‌ను మారిస్తే మాత్రం భారత క్రికెట్‌ జట్టును డేంజర్‌ జోన్‌లో పడేస్తుందన్నారు.

‘సుదీర్ఘకాలంగా రవిశాస్త్రి-కోహ్లిల కాంబినేషన్‌ బాగానే ఉంది.  వీరిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వరల్డ్‌కప్‌ తర్వాత రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది. ఈ క్రమంలోనే కోచ్‌ల ఎంపిక కోసం సీఓఏ దరఖాస్తులకు ఆహ్వానించింది. ప్రస్తుతం టీమిండియా కోచ్‌ను మార్చాల్సిన అవసరం లేదు. కొత్త కోచ్‌ వస్తే ఆటగాళ్లు పరిస్థితులకు అలవాటు పడటానికి సమయం పడుతుంది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ ఉన్న తరుణంలో కోచ్‌ మార్పు సబబు కాదు’ అని బీసీసీఐ అధికారి వెల్లడించారు. వెస్టిండీస్‌ పర్యటన వరకూ రవిశాస్త్రి కోచ్‌గా కొనసాగనున్నాడు. వరల్డ్‌కప్‌ తర్వాత రవిశాస్త్రితో పాటు మిగతా సభ్యలు పదవీ కాలం ముగిసినా విండీస్‌ పర్యటన నేపథ్యంలో వారి నియామకాన్ని మరో 45 రోజులు పొడిగించారు.

మరిన్ని వార్తలు