ఇదొక కఠినమైన సవాల్: స్టీవ్ స్మిత్

11 Sep, 2017 13:47 IST|Sakshi
ఇదొక కఠినమైన సవాల్: స్టీవ్ స్మిత్

చెన్నై:ప్రస్తుత భారత పర్యటన తమకు అత్యంత కఠినమైన సవాల్ అని ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా తిరుగులేని విజయాలు సాధిస్తున్న టీమిండియాపై పైచేయి సాధించడం అంత ఈజీ కాదని తమ ఆటగాళ్లను ముందుగా హెచ్చరించారు. భారత జట్టును ఎదుర్కోవడానికి ఆసీస్ ఆటగాళ్లంతా సమష్టిగా పోరాడక తప్పదన్నారు. ఐదు వన్డేలు, మూడు ట్వంటీ 20లను ఆడేందుకు స్మిత్ సేన భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే.  దీనిలో భాగంగా స్మిత్ మీడియాతో మాట్లాడారు.

 

'ఇదొక క్లిష్టమైన పర్యటన. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన భారత జట్టు.. సక్సెస్ ఫుల్ గా తిరిగొచ్చింది. భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టును ప్రతిఘటించడం కష్టమే. ఆస్ట్రేలియా జట్టుకు ఇదొక సవాల్ గా భావిస్తున్నా. అదే సమయంలో విరాట్ సేనను ఢీకొనేందుకు ఆతృతగా ఉన్నాం' అని స్మిత్ పేర్కొన్నారు.

పరిమిత ఓవర్ల క్రికెట్ అనేది టెస్టు క్రికెట్ కు చాలా భిన్నమైన స్మిత్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రధానంగా అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్ లతో కూడి న భారత స్పిన్ విభాగం చాలా పటిష్టంగా ఉందన్నారు. మరొకవైపు ఎటువంటి వివాదాలు లేకుండా ఒక మంచి వాతావరణంలోనే  మొత్తం సిరీస్ జరుగుతుందని ఆశిస్తున్నానని స్మిత్ తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన తొలి వన్డేతో ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు