ఇదొక పనికిమాలిన చర్య: బ్రెట్‌ లీ

2 Aug, 2019 20:00 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టా‍త్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా టెస్టు జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు కొనసాగిస్తున్నారు. మైదానంలో అభిమానులు ఆటగాళ్లను గుర్తించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) కొత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి టెస్టు క్రికెట్‌లో కూడా ఆటగాళ్ల జెర్సీలపై నంబర్లు, పేర్లు కొనసాగించాలని ఐసీసీ గతేడాది నిర్ణయించింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి.

టెస్టు క్రికెట్‌లో ఆటగాళ్ల జెర్సీలపై నంబర్లూ, పేర్లు చెత్తగా ఉన్నాయంటూ ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్‌ ఇప్పటికే విమర్శించగా, ఇప్పుడు అతని సరసన ఆ దేశానికే చెందిన బ్రెట్‌ లీ చేరిపోయాడు. ఇదొక పనికిమాలిన నిర్ణయమని ధ్వజమెత్తాడు. ‘ ఐసీసీ కొత్తగా చేపట్టిన ఈ విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. టెస్టు క్రికెట్‌లో ఆటగాళ్ల జెర్సీలపై నంబర్లూ, పేర్లు వికారంగా ఉన్నాయి. ఇది పనికిమాలిన చర్యగా కనబడుతోంది.  క్రికెట్‌లో మార్పులు తీసుకురావడానికి ఐసీసీ చర్యలు చేపట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మాత్రం కచ్చితంగా సరైనది కాదు’ అని బ్రెట్‌ లీ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు