ఇక టీమిండియా కెప్టెన్‌ రోహితేనా?

13 Jul, 2019 18:30 IST|Sakshi

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌ నుంచి నిష్క్రమించడంతో అది విరాట్‌ కోహ్లి కెప్టెన్సీపై ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. లీగ్‌ దశలో విశేషంగా ఆకట్టుకున్న టీమిండియా.. నాకౌట్‌ సమరానికి వచ్చేసరికి అంచనాలను అందుకోలేకపోయింది. అయితే అదే సమయంలో కోహ్లి, రోహిత్‌ శర్మలు రెండు వర్గాలు విడిపోయారనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. ఇప్పటివరకూ కోహ్లి కెప్టెన్సీ గురించి ఎవరూ మాట్లాడకపోయినా, తాజాగా భారత మాజీ టెస్టు క్రికెటర్‌ వసీం జాఫర్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తిని రేపుతోంది. ‘ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు రోహిత్‌ శర్మకు అప్పగించే సమయం వచ్చేసిందా’ అంటూ ట్వీట్‌ చేశాడు. అదే సమయంలో రోహిత్‌ శర్మనే భారత  క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా సరైన వాడంటూ పేర్కొన్నాడు. మరో అడుగు ముందుకేసిన జాఫర్‌.. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్‌ను టీమిండియా కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు.(ఇక్కడ చదవండి: భారత క్రికెట్‌ జట్టులో గ్రూపు తగాదాలు?)

ఇక అధిక సంఖ్యలో భారత క్రికెట్‌ అభిమానులు కూడా రోహిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పాలంటూ అభిప్రాయపడుతున్నారు. సెమీస్‌లో టీమిండియా ఓటమి యావత్‌ భారత క్రీడాభిమానుల్ని షాక్‌కు గురి చేసిన తరుణంలో 50 ఓవర్ల క్రికెట్‌కు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మనే సరైన వాడంటూ పేర్కొంటున్నారు. త్వరలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనున్న భారత్‌ వన్డే, టీ20ల సిరీస్‌కు రోహిత్‌ కెప్టెన్‌గా చేసే అవకాశం ఉంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లికి విండీస్‌ పర్యటన నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారనే వార్తల నేపథ్యంలో రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించడం దాదాపు ఖాయమే. గతంలో రోహిత్‌ కెప్టెన్సీలో ఆసియా కప్‌, నిదాహాస్‌ ట్రోఫీలను భారత్‌ కైవసం చేసుకుంది. పలు దేశాలు తలపడే ఐసీసీ టోర్నమెంట్లలో కోహ్లికి మంచి రికార్డు లేకపోవడం ఒకటైతే, రోహిత్‌కు మాత్రం ఘనమైన రికార్డు ఉండటమే కెప్టెన్సీ మార్పు డిమాండ్‌ రావడానికి ప్రధాన కారణంగా కనబడుతోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు