మా బౌలర్లు భేష్

19 Nov, 2015 01:35 IST|Sakshi
మా బౌలర్లు భేష్

ఫలితం నిరాశపర్చింది విరాట్ కోహ్లి వ్యాఖ్య
బెంగళూరు: వర్షం కారణంగా రెండో టెస్టులో నాలుగు రోజుల పాటు ఆట జరగకపోవడం తమను పూర్తిగా నిరాశకు గురి చేసిందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. శుభారంభం కొనసాగించాలని పట్టుదలగా ఉన్నా సాధ్యం కాలేదని అన్నాడు. ‘మేం పటిష్టమైన స్థితిలో నిలిచాం. అక్కడినుంచి మ్యాచ్‌ను శాసించే ప్రయత్నంలో ఉండగా వాతావరణం ప్రభావం చూపించింది. తర్వాతి నాలుగు రోజులు ఏమి చేయలేకపోయాం’ అని కోహ్లి నిరాశగా చెప్పాడు.

చిన్నస్వామి స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలమని, ఇలాంటి చోట మూడు సెషన్ల లోపే నంబర్‌వన్ జట్టును ఆలౌట్ చేయడం తమ బౌలర్ల ఘనతగా పేర్కొన్న కెప్టెన్, వారిపై ప్రశంసలు కురిపించాడు.  నాలుగు రోజుల ఆట పోయాక రిజర్వ్ డే ఉన్నా ప్రయోజనం ఉండదని, ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనలే కొనసాగడం మంచిదని అతను అభిప్రాయ పడ్డాడు. తొలి టెస్టులో విఫలమైన శిఖర్ ధావన్, ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న కీపర్ సాహాలకు కోహ్లి మద్దతుగా నిలిచాడు.

వారిద్దరు బాగా ఆడుతున్నారని, అనవసరపు ఒత్తిడి పెంచవద్దని అతను కోరాడు. మరో వైపు ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ తమ బ్యాటింగ్ విఫలమైందని, అయితే ఇంకా సిరీస్‌లో కోలుకునేందుకు అవకాశం ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీం ఆమ్లా విశ్వాసం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు