ఆ విషయంపై సీరియస్‌గా దృష్టి పెట్టాం: బంగ్లా కెప్టెన్‌

17 Nov, 2019 12:12 IST|Sakshi

ఇండోర్‌: టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం చెందడం పట్ల బంగ్లా కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్‌ చేతిలో ఇన్నింగ్స్‌ పరాజయాన్ని మూటగట్టుకోవడానికి బ్యాటింగ్‌ వైఫల్యమే ప్రధాన కారణమన్నాడు. తమ బ్యాటింగ్‌ సరిగా లేకపోవడంతో దారుణమైన ఓటమిని ఖాతాలో వేసుకోవాల్సి వచ్చిందన్నాడు. ఈ విషయంలో సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉందన్నాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత తమ టెస్టు జట్టు గురించి  కోచ్‌తో కలిసి కార్యచరణకు రూపొందిస్తామన్నాడు. ‘ మా టెస్టు జట్టు కూర్పుపై ప్రధానం చర్చించాలి. ఇప్పటికిప్పుడే ఫలితాలు ఉండకపోవచ్చు.

కనీసం రెండు-మూడు సంవత్సరాల్లోనైనా మా టెస్టు జట్టును పటిష్టం చేయాలి. మళ్లీ భారత్‌ పర్యటనకు వచ్చేసరికి టెస్టు జట్టు బలంగా చేయడమే మా తదుపరి లక్ష్యం. మనం మానసికంగా సిద్ధమైతే సానుకూలంగా ఆలోచిస్తాం. మనం ఎప్పుడైతే టెస్టు క్రికెట్‌ ఆడుతున్నామో అందుకు మైండ్‌సెట్‌ను కూడా మార్చుకోవాలి. అప్పుడే ఇది టెస్టు క్రికెట్‌ అనే విషయం గురించి ఆలోచిస్తాం. మేము చాలా టెస్టు క్రికెట్‌ ఆడాల్సి ఉంది. గత ఏడు నెలల్లో మేము ఆడిన టెస్టుల సంఖ్య రెండే. అందుచేతే మిగతా జట్లు తరహాలో టెస్టు క్రికెట్‌ ఆడలేకపోతున్నాం. ఇదే ముఖ్యమైన తేడా’ అని మోమినుల్‌ తెలిపాడు.

భారత్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు చాపచుట్టేసి ఇన్నింగ్స్‌ పరాజయాన్ని చవిచూసింది. శుక‍్రవారం ఈడెన్‌ గార్డెన్‌లో భారత్‌-బంగ్లాల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇది డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌గా నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు