చిక్కుల్లో పడ్డ అక్తర్‌కు మాజీ క్రికెటర్‌ సపోర్ట్‌

1 May, 2020 13:26 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) లీగల్‌ డిపార్ట్‌మెంట్‌పై సంచలన కామెంట్స్‌ చేసి చిక్కుల్లో పడ్డ ఆ దేశ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌కు మాజీ క్రికెటర్‌ అండగా నిలిచాడు. అక్తర్‌ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటు తప్పూ లేదని అందుకు తాను కూడా మద్దతు ఇస్తున్నానని యూనిస్‌ ఖాన్‌ ముందుకొచ్చాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ను విశ్లేషించడానికి ఇదే సరైన సమయమని యూనిస్‌ పేర్కొన్నాడు. ‘ అక్తర్‌ మాట్లాడింది చేదు నిజం. అతని వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పుల్లేదు. రాజీ పడకుండా ఉండటానికి అక్తర్‌ వ్యాఖ్యలే నిదర్శనం. అక్తర్‌ వ్యాఖ్యలతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఇకనైనా విశ్లేషణ ఆరంభించాలి. పాకిస్తాన్‌ క్రికెటర్ల భవిష్యత్తు, దేశ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. నేను అక్తర్‌కు అండగా ఉంటా’ అని యూనిస్‌ పేర్కొన్నాడు. (అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు)

కేవలం బుకీ సంప్రదించిన విషయాన్ని చెప్పలేదని ఉమర్‌ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం సమంజసం కాదని అక్తర్‌ ప్రశ్నించాడు. అవినీతి క్రికెటర్లపై ఏదో చర‍్యలను తీసుకుంటున్నామని బిల్డప్‌ ఇచ్చేందుకు, కొంతమంది అవినీతి క్రికెటర్లను కాపాడటానికే ఉమర్‌ కెరీర్‌ను పణంగా పెట్టారంటూ ధ్వజమెత్తాడు. ఈ విషయంలో పీసీబీ  లీగల్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయాన్ని సవాల్‌ చేశాడు. మీకు నచ్చిన మ్యాచ్‌ ఫిక్సర్లను రక్క్షించడానికి మరి కొం‍తమందిపై ఇలాంటి చర్యలు తీసుకుంటారా అంటూ నిలదీశాడు. ఒక చిన్నపాటి తప్పు చేస్తే అందుకు ఆరు నెలలో రెండు సంవత్సరాలు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని, కెరీర్‌ నాశనం అయిపోయేలా మూడేళ్ల నిషేధం ఎందుకోసం, ఎవరి కోసం అంటూ విమర్శించాడు.

పీసీబీ లీగల్‌ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్‌కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై తన యూట్యూబ్‌ చానల్‌ వీడియోను విడుదల చేసి మరీ పీసీబీ చర్యలను ప్రశ్నించాడు. దాంతో పీసీబీ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ అక్తర్‌పై పరువు నష్టం కేసు వేయడానికి సిద్ధమైంది. తమ లీగల్‌ వ్యవహారాల్లో తలదూర్చి అక్తర్‌ తప్పుచేశాడంటూ పీసీబీ లీగల్‌ అడ్వైజర్‌ తఫాజ్జుల్‌ రిజ్వి పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్‌ కేసును ఫైల్‌ చేశారు. న్యాయపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు అక్తర్‌ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాఖ్యానిస్తే మంచిదనే సలహా ఇచ్చారు. దీనిపై పీసీబీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు అక్తర్‌ బహిరంగంగా పీసీబీ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు తమ అడ్వైజరీపై ఇలా ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఇది అక్తర్‌కు సరికాదని మండిపడింది.(అతనొక మూర్చ రోగి: పీసీబీ మాజీ చైర్మన్‌)

మరిన్ని వార్తలు