కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే గెలుపొందండపై..

28 Apr, 2018 11:01 IST|Sakshi
శ్రేయస్‌ అయ్యర్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నూతన సారథి శ్రేయస్‌ అయ్యర్‌ తన కెప్టెన్సీని విజయంతో ప్రారంభించాడు. ఫీరోజ్‌షా కోట్లా మైదానంలో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టుకు సారథ్యం వహించడమే కాదు.. అద్భుతమైన బ్యాటింగ్‌తో పెద్ద విజయాన్ని అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన శ్రేయస్‌ 40 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 219 పరుగులు చేసింది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. శివం మావి వేసిన 20వ ఓవర్‌లో 29 పరుగులు పిండుకున్న శ్రేయస్‌ .. మొత్తం తాను ఎదుర్కొన్న 40 బంతుల్లో పది సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా లక్ష్యఛేదనలో చతికిలపడింది. అండ్రూ రస్సెల్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఓ మోస్తరుగా రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో కోల్‌కతా 55 పరుగుల తేడాతో చిత్తయింది.

ఐపీఎల్‌లో కెప్టెన్సీని విజయంతో ప్రారంభించడం గొప్పగా అనిపిస్తోందని 23 ఏళ్ల శ్రేయస్‌ అయ్యర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం అతను మాట్లాడుతూ ‘ఇది గొప్పగా అనిపిస్తోంది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం అద్భుతంగా ఉంది’ అని అన్నాడు. ‘టాస్‌ గెలిస్తే.. మొదట బౌలింగ్‌ తీసుకుందామని అనుకున్నాం. కానీ, టాస్‌ ఓడటం కూడా మంచిదే అయింది’ అని తెలిపాడు. టాస్‌ ఓడి.. బ్యాటింగ్‌ తీసుకున్నప్పటికీ ఢిల్లీకి పృథ్వీ షా-కొలిన్‌ మున్రో జోడీ మంచి శుభారంభాన్నిచ్చింది. ముఖ్యంగా 44 బంతుల్లో 62 పరుగులు చేసిన కుర్రాడు పృథ్వీషాపై శ్రేయస్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. పృథ్వీ ఢిల్లీకి మంచి ఆరంభాన్ని ఇచ్చాడని, ఈ సీజన్‌ ప్రారంభమైన నాటినుంచి అతను బాగా ఆడుతూ.. జట్టుకు అవసరమైన శుభారంభాలను ఇస్తున్నాడని ప్రశంసించాడు. 18 సంవత్సరాల 169 రోజుల వయస్సున పృథ్వీ షా.. ఐపీఎల్‌ అర్ధ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సంజూ  శాంసన్‌తో కలిసి రికార్డు పంచుకుంటున్నాడు. అలాగే మున్రో, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌  లియాం ప్లంకెట్‌పైనా శ్రేయస్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

మరిన్ని వార్తలు