ఇది అత్యంత చాలెంజింగ్‌ వరల్డ్‌కప్‌: కోహ్లి

21 May, 2019 16:55 IST|Sakshi

ముంబై: రాబోవు వరల్డ్‌కప్‌లో ఒత్తిడిని అధిగమించడం చాలా ముఖ్యమని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. తమదైన రోజున ఏ జట్టునైనా ప్రత్యర్థి దెబ్బతీయగలదన్న కోహ్లి.. ప్రతీ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉందన్నాడు. ఈ వరల్డ్‌కప్‌కు అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నట్లు కోహ్లి తెలిపాడు. ప్రస్తుతమున్న భారత జట్టు చాలా సమతుల్యంగా ఉందని, మెరుగైన ప్రదర్శన చేయడమే తమ ముందున్న లక్ష్యంగా పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ తాను ఆడిన మూడు వరల్డ్ కప్‌లలో ఇదే అత్యంత చాలెంజింగ్ వరల్డ్ కప్ అని కోహ్లి తెలిపాడు. వరల్డ్‌కప్‌ కోసం ఇంగ్లండ్ బయల్దేరడానికి ముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లి మంగళవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ క్రికెట్ ఆడటంపైనే ఫోకస్ పెట్టామన్న కోహ్లి.. ఐపీఎల్ సమయంలోనూ తమ బౌలర్లు 50 ఓవర్ల క్రికెట్ కోసం సన్నద్ధమయ్యారని తెలిపాడు.

ఐపీఎల్‌లో కుల్దీప్ యాదవ్ అంతగా ఆకట్టుకోకపోవడం పట్ల స్పందించిన కోహ్లి.. వరల్డ్ కప్ ప్రారంభానికల్లా అతడు గాడిలో పడతాడన్నాడు. కుల్దీప్, చహల్ వరల్డ్ కప్‌లో రెండు స్తంభాలంటూ స్పిన్ ద్వయంపై కెప్టెన్ ప్రశంసలు గుప్పించాడు. కేదార్ జాదవ్ గాయడం విషయమై ఆందోళన చెందడం లేదన్నారు. ఒత్తిడిని అధిగమించిన జట్టే వరల్డ్ కప్‌లో మెరుగైన ప్రదర్శన చేయగలదన్నాడు. ఇక పాకిస్తాన్‌తో తలపడటం గురించి మాట్లాడుతూ.. ఒక్కో జట్టు గురించి ఆలోచిస్తే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో సత్తా చాటడంపై ఫోకస్ చేయలేమన్నాడు. ప్రతీ జట్టుతో మ్యాచ్‌ను సమంగానే చూస్తామన్నాడు. ఇక్కడ ఏ జట్టును తక్కువ అంచనా వేయడం లేదని కోహ్లి తెలిపాడు. వరల్డ్ కప్‌లో ఎంఎస్‌ ధోని కీలక పాత్ర పోషిస్తాడని కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
మెరుగైన ప్రదర్శన చేయడమే మా ముందున్న లక్ష్యం

మరిన్ని వార్తలు