నా కెరీర్‌లో అదే చెత్త మ్యాచ్‌: అక్తర్‌

6 Aug, 2019 13:32 IST|Sakshi

కరాచీ: సుమారు 16 ఏళ్ల క్రితం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ తన కెరీర్‌లో అత్యంత చెత్త మ్యాచ్‌గా పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. 2003 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓటమి చెందడం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నాడు. తమకు బలమైన బౌలింగ్‌ యూనిట్‌ ఉన్నప్పటికీ 274 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవడంలో విఫలమయ్యామన్నాడు. అది ఎప్పటికీ తన కెరీర్‌లో చెత్త మ్యాచ్‌గా మిగిలిపోతుందన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌లో ఒక వీడియోను పోస్ట్‌ చేశాడు అక్తర్‌. ‘ నా కెరీర్‌లో నన్ను తీవ్ర నిరాశకు గురి చేసిన మ్యాచ్‌ అది.

సెంచూరియన్‌ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మేము 274 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించాం​. అప్పట్లో మా బౌలింగ్‌  చాలా పటిష్టంగా ఉండేది. అయినా ఆ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయాం. మా బ్యాటింగ్‌ ముగిసిన తర్వాత 30-40 పరుగులు తక్కువ చేశామని మా జట్టు సభ్యులతో అన్నా. దాంతో నాపై వారు అంత ఎత్తున లేచారు. 273 పరుగులు చాలకపోతే, నీకు ఎంత కావాలి అంటూ చిర్రుబుర్రులాడారు. మనకు టీమిండియాను కట్టడి చేసే సత్తా ఉందన్నారు. అది బ్యాటింగ్‌ పిచ్‌ కావడంతో ఆ పరుగులు సరిపోవని నాకు అర్థమైంది. అదే నిజమైంది. సచిన్‌ టెండూల్కర్‌ 98 పరుగులతో మెరవడంతో ఇంకా నాలుగు ఓవర్లు ఉండగానే టీమిండియా గెలిచింది. అది నేను ఎప్పటికీ మరచిపోలేని మ్యాచ్‌. ఆ మ్యాచ్‌ నాకు ఒక చేదు జ్ఞాపకం’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా