వివాదాల్ని రచ్చ చేయొద్దు

29 Jan, 2018 11:18 IST|Sakshi
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న శివలాల్‌ యాదవ్‌

నర్సాపూర్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లోని సభ్యుల మధ్య విభేదాలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి గానీ వివాదాల్ని రచ్చ చేయడం తగదని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్‌ శివలాల్‌ యాదవ్‌ అన్నారు. అజయ్‌ యాదవ్‌ స్మారకార్థం నిర్వహిస్తోన్న ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నీని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభేదాలు ఉన్నంత మాత్రాన బజారున పడి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి చర్యల వల్ల హెచ్‌సీఏ పరువు పోతుందని అన్నారు. హెచ్‌సీఏ సమావేశాలకు భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ను రానివ్వకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండరాదని పలు కమిటీలు, కమిషన్‌ల నిబంధనలు స్పష్టం చేస్తున్నప్పటికీ హెచ్‌సీఏ అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వివేక్‌ ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల క్రీడలను ప్రోత్సహిస్తుండటం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. స్టేడియాలు నిర్మిస్తే ఉపయోగం... హెచ్‌సీఏ ఆధ్వర్యంలో స్టేడియాల నిర్మాణంతో పాటు క్రీడాకారులకు ఉపయోగపడే ప్రాజెక్టులు చేపడితే ముందు తరాల వారికి ఉపయోగకరంగా ఉంటుందని హెచ్‌సీఏ మాజీ ప్రధాన కార్యదర్శి చలపతిరావు అన్నారు. తాము హెచ్‌సీఏను పాలించిన సమయంలో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పలు జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు. పలు జిల్లాల్లో స్టేడియాలను నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్‌ యాదవ్‌ ట్రస్టు చైర్మన్, ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడు మురళీధర్‌ యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు