అది నా తలపోటు కాదు: ధావన్‌

11 Jan, 2020 15:01 IST|Sakshi

పుణె: వరల్డ్‌ టీ20కి ముందుగా ఒక పటిష్టమైన ఎలెవన్‌ జట్టును రూపొందించాలని చూస్తున్న టీమిండియాకు సరికొత్త తలపోటు మొదలైంది. ప్రతీ ఆటగాడు తమకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంతో జట్టు కూర్పు ఎలా ఉండాలి అనే విషయంపై టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఇంకా ఒక క్లారిటీ రాలేదు. వరల్డ్‌ టీ20కి చాలా సమయం ఉన్నందున అప్పటికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఫలాన ఆటగాడు ఆ మెగాటోర్నీకి అనవసరం అంటూ మాజీలు పేర్కొనడమే సెలక్షన్‌ కమిటీని ఆలోచనలో పడేస్తోంది. ప్రధానంగా వికెట్‌ కీపర్ల విషయంలో ఎంఎస్‌ ధోని ఉంటాడా.. లేక రిషభ్‌ పంత్‌ను వేసుకోవాలా అనేది ఒకవైపు కలవరపెడుతుంటే, ఓపెనర్ల విషయంలో కేఎల్‌ రాహుల్‌-శిఖర్‌ ధావన్‌లకు సంబంధించి మరొక అంశం టెన్షన్‌ పెడుతోంది.

దీనిపై శ్రీలంకతో మూడో టీ20 తర్వాత శిఖర్‌ ధావన్‌ మాట్లాడుతూ.. ‘ వరల్డ్‌ టీ20 నాటిని నేను జట్టులో ఉంటానా.. లేదా అనే విషయం నా చేతుల్లో లేదు. అది నా తలపోటు కాదు. దాని గురించి నేను పెద్దగా ఆలోచించను. నాకొచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవడమే నా పని’ అని పేర్కొన్నాడు.  ఓపెనర్ల విషయంలో రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌తో పాటు తాను మెరుగైన ప్రదర్శనే కనబరుస్తున్నానని ధావన్‌ తెలిపాడు.  ‘2019లో రోహిత్‌ సూపర్‌ ఫామ్‌లో కొనసాగాడు. ఇక రాహుల్‌ కూడా రెండు-మూడు నెలల నుంచి గాడిలో పడ్డాడు. అతనొక మంచి ఆటగాడు. అయినప్పటికీ వారితో పాటు నేను కూడా రేసులో ఉన్నాను. కానీ వరల్డ్‌ టీ20కి నేను ఉంటానో.. లేదో అనే విషయం నా పరిధిలో లేదు. అది జట్టు మేనేజ్‌మెంట్‌ చూసుకుంటుంది.  ఆ విషయం గురించి ఆలోచించడం ఇప్పట్నుంచే అనవసరం’ అని ధావన్‌ అన్నాడు.(ఇక్కడ చదవండి: కోహ్లి వరల్డ్‌ రికార్డు.. సిరీస్‌ భారత్‌ కైవసం)

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌-ధావన్‌ల కాంబినేషన్‌ ఒకటైతే, కేఎల్‌ రాహుల్‌-ధావన్‌ల కాంబినేషన్‌ మరొకటి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎప్పుడూ రెగ్యులర్‌ ఓపెనర్ల విషయంలో రోహిత్‌తో పాటు ధావన్‌కే తొలి ప్రాధాన్యత ఉండేది. కాకపోతే ఇప్పుడు పరిస్థితి మారింది. రాహుల్‌-ధావన్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కొన్ని నెలల క్రితం పేలవమైన ఫామ్‌లో కొనసాగిన రాహుల్‌ తన ఫామ్‌ను అందిపుచ్చుకోవడంతో ఇప్పుడు ధావన్‌కు పోటీగా మారిపోయాడు. ప్రతీ మ్యాచ్‌కు రాటుదేలుతూ ధావన్‌ను కాస్త వెనక్కినెట్టాడు. ఒకవైపు ధావన్‌కు గాయం కావడం కూడా రాహుల్‌ కలిసొచ్చింది. గతేడాది ధావన్‌ ఎక్కువగా గాయాలతో సతమవుతూ ఉండటంతో రాహుల్‌కు వరుస పెట్టి అవకాశాలు రావడం వాటిని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ధావన్‌పై రాహుల్‌ పైచేయి సాధించాడు. కొంతమంది మాజీ క్రికెటర్లు రాహుల్‌నే వరల్డ్‌ టీ20కి ఎంపిక చేయాలని సూచించడంతో ధావన్‌పై పరోక్షంగా ఒత్తిడి నెలకొంది. ఇక టీ20ల్లో ధావన్‌ యావరేజ్‌ కంటే రాహుల్‌ యావరేజే మెరుగ్గా ఉంది. టీ20ల్లో రాహుల్‌ యావరేజ్‌ 44.17గా ఉంటే, ధావన్‌ సగటు 28.35గా ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు