నీకు ఆవేశం ఎక్కువ.. సెట్‌ కావు..!

5 Apr, 2020 19:08 IST|Sakshi

సెలక్టర్లతోనే తేల్చుకున్నా..

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయిన శ్రేయస్‌ అయ్యర్‌కు జాతీయ జట్టులో ఆడే అవకాశాలు అంత తేలిగ్గా రాలేదట. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాల్గో స్థానంపై భరోసా కల్పించిన అయ్యర్‌.. సీనియర్‌ జట్టులోకి రావడానికి తన బ్యాటింగ్‌ స్టైల్‌నే మార్చుకున్నాడట. ఎంతో కాలం అవకాశాలు కోసం చూసి చూసి చివరకు అందుకు పరిష్కారం కనుగొన్న తర్వాతే భారత జట్టులో చోటు లభించిందని అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ జరిగిన తర్వాత భారత జట్టుకు నాల్గో స్థానంపై అయ్యర్‌ నమ్మకం కల్గించాడు. వరల్డ్‌కప్‌లో అయ్యర్‌కు అవకాశం ఇవ్వని టీమిండియా మేనేజ్‌మెంట్‌.. ఆ తర్వాత మాత్రం అతన్ని రెగ్యులర్‌గా జట్టులోకి తీసుకుంది. కాగా, తాను ఎలా పరిణితి చెంది జాతీయ జట్టులోకి వచ్చాననే విషయాలను అయ్యర్‌ వెల్లడించాడు. (‘నేను కెప్టెన్‌ ఎందుకు కాకూడదు)

‘ ఒక దేశవాళీ సీజన్‌లో 1300 పరుగులు చేశాను. కానీ భారత జట్టులో ఎంపిక కాలేదు. నాకు కచ్చితంగా జట్టులో చోటు దక్కుతుందని భావించినా అది జరగలేదు. కొంతమందికి అవకాశం ఇచ్చిన సెలక్టర్లు నాకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ వారి ప్రదర్శన నా కంటే గొప్పగా ఉందంటే అది లేదు. కానీ నాకు అవకాశం రాలేదు. కారణాలు తెలుసుకునే పనిలో పడ్డా. ఈ విషయాన్ని సెలక్టర్లతోనే తేల్చుకోవాలని అనుకున్నా. నాలో ఏం తప్పు ఉందని వారి అడగాలని ఫిక్స్‌ అయ్యా. దాంతో నేను సెలక్షన్‌ కమిటీలోని సభ్యులనే అడిగేశా. అక్కడ నాకు వారు కొన్ని విషయాలు చెప్పారు.  వారు నాలో ఉన్న లోపాలను వేలెత్తి చూపారు’ అని అయ్యర్‌ తెలిపాడు.

‘‘నీకు ఆవేశం ఎక్కువ. దూకుడు స్వభావంతో బ్యాటింగ్‌ చేస్తావ్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో నీ దూకుడు ఉపయోగపడదు. ఎవరైనా బౌలర్‌ మంచి బంతులు వేస్తే అప్పుడు దాన్ని నిదానంగా ఆడే సామర్థ్యం నీలో లేదు. నువ్వు సెట్‌ కావు’’ అని సెలక్టర్లు తనతో చెప్పినట్లు అయ్యర్‌ తెలిపాడు. దాంతో తాను బ్యాటింగ్‌లో మరింత పరిణితి సాధించాలనుకున్నానని, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాలనే నిర్ణయించుకున్నానన్నాడు. దాని కోసం చాలా సమయం తీసుకోవడంతో తనలో మరింత నిలకడ వచ్చిందని, అదే జాతీయ జట్టులో రావడానికి దోహద పడిందని అయ్యర్‌ స్పష్టం చేశాడు. (సే‘యస్‌’ అయ్యర్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు