మూడేళ్ల తర్వాత అయ్యర్‌-టేలర్‌!

6 Feb, 2020 12:26 IST|Sakshi

హామిల్టన్‌:  క్రికెట్‌ను ఎ‍క్కువగా ఇష్టపడే అభిమానులకు సైతం కొన్ని విషయాలను చూస్తే ఇది నిజమా.. అనిపిస్తూ ఉంటుంది. టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఇలాంటి విషయమే ఒకటి చోటు చేసుకుంది. సాధారణంగా వన్డే ఫార్మాట్‌లో ఓపెనర్లు, ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన ఆటగాళ్ల సెంచరీలే ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత సెకండ్‌ డౌన్‌లో అంటే నాల్గో స్థానంలో హాఫ్‌ సెంచరీలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. నాలుగో స్థానం నుంచి పదో స్థానం వరకూ తరుచు హాఫ్‌ సెంచరీలు నమోదు అవుతూ ఉంటాయి.  ఓపెనర్లు విఫలమైన క్రమంలో మూడు, నాలుగు స్థానాల్లో దిగే బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే నిన్న టీమిండియా-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఇరు జట్లలోని నాల్గో స్థానంలో వచ్చిన ఆటగాళ్లు సెంచరీల మోత మోగించారు. (ఇక్కడ చదవండి: గెలుపు ‘రాస్‌’ పెట్టాడు)

ఒకరు చేసిన సెంచరీ భారీ టార్గెట్‌ను నిర్దేశిస్తే, మరొకరు చేసిన శతకం మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చింది. అందులో ఒకరు శ్రేయస్‌ అ‍య్యర్‌ అయితే, మరొకరు రాస్‌ టేలర్‌. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసే క్రమంలో నాల్గో స్థానంలో వచ్చిన అయ్యర్‌ 107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 103 పరుగులు చేస్తే, టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నాల్గో స్థానంలో వచ్చిన టేలర్‌ 84 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో అజేయంగా 109 పరుగులు చేశాడు. అయితే ఒకే వన్డే మ్యాచ్‌లో నాల్గో స్థానంలో వచ్చిన ఇరు జట్ల ఆటగాళ్లు సెంచరీలు చేసి చాలాకాలమే అయ్యింది. 2017లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన ఒక వన్డేలో నాల్గో స్థానంలో వచ్చిన యువరాజ్‌ సింగ్‌-ఇయాన్‌ మోర్గాన్‌లు సెంచరీలు బాదితే, ఆ తర్వాత ఇంతకాలానికి ఆ స్థానంలో ఇరు జట్ల ఆటగాళ్లు శతకాలతో మెరవడం విశేషం. వీరిలో రాస్‌ టేలర్‌ వెటరన్‌ క్రికెటర్‌ కాగా, శ్రేయస్‌ అ‍య్యర్‌ యువ క్రికెటర్‌. అంతకుముందు 2007లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన వన్డేలో నాల్గో స్థానంలో ఆడిన ఏబీ డివిలియర్స్‌-టెతెండా తైబులు సెంచరీలు సాధించారు. (ఇక్కడ చదవండి: అదే టర్నింగ్‌ పాయింట్‌: కోహ్లి)

మరిన్ని వార్తలు