దానికి సమాధానం కోహ్లి దగ్గరే!

21 Mar, 2019 11:27 IST|Sakshi

కోల్‌కతా : టీమిండియా పరుగుల యంత్రం, సారథి విరాట్‌ కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ జాక్వస్‌ కలిస్‌ ప్రశంసలు జల్లు కురిపించాడు. కోహ్లి వరల్డ్‌ క్లాస్‌ ఆటగాడంటూ అభివర్ణించాడు. ప్రస్తుతం కోహ్లి ఆకలితో ఉన్న పులిలా రెచ్చిపోతున్నాడని.. అందుకే పరుగుల సునామీ సృష్టిస్తున్నాడని పేర్కొన్నాడు.  కష్టపడేతత్వం, ఆటపై మక్కువ గల అతడు మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించాడు. ఇక ప్రస్తుతం ఎక్కువగా చర్చలో ఉన్న  క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ అంతర్జాతీయ వంద సెంచరీల రికార్డును కోహ్లి అధిగమిస్తాడా అనే విషయంపై కూడా కలిస్‌ స్పందించాడు. ఆ రికార్డును సాధిస్తాడా? లేదా? అనే విషయాన్ని కోహ్లినే చెప్పాలన్నాడు. ఎందుకంటే ఫిట్‌నెస్‌, ఆడగల సత్తా, సామర్థ్యం గురించి అతడికే ఒక క్లారిటీ ఉంటుందన్నాడు. 
కోహ్లిపై ఒత్తిడి ఉండదు
స్వదేశంలో ఆస్ట్రేలియాపై ఎదురైన ఓటమి ప్రభావం టీమిండియాపై ఉండదని కలిస్‌ అభిప్రాయపడ్డాడు. ఇక ఇంగ్లండ్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో కోహ్లిపై ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో మరింత రెచ్చిపోతాడని వివరించాడు. ఎక్కడ.. ఎలా ఆడాలో కోహ్లికి తెలుసని, మిగతా ఆటగాళ్లు అతడిని అనుసరిస్తే సరిపోతుందన్నాడు. ఏ మెగాటోర్నీలోనేనా టీమిండియానే హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుందని కలిస్‌ పేర్కొన్నాడు.     
 
 

 

మరిన్ని వార్తలు