టీమిండియా కథ ముగిసె..

10 Jul, 2019 19:41 IST|Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా కథ ముగిసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్‌ 18 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.  రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాటం, ఎంఎస్‌ ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాయి. భారత జట్టు 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌట్‌ కావడంతో ఓటమి తప్పలేదు. దాంతో టీమిండియా పోరాటం వరుసగా రెండో సారి కూడా సెమీస్‌లోనే ముగియగా, న్యూజిలాండ్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది.

కీలక సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో కోహ్లి గ్యాంగ్‌ పెవిలియన్‌కు క్యూ కట్టింది. రోహిత్‌ శర్మ(1), విరాట్‌ ​కోహ్లి(1), కేఎల్‌ రాహుల్‌(1)లు తలో పరుగు చేసి పెవిలియన్‌ చేరడంతో భారత్‌ కష్టాల్లో పడింది. ఆపై దినేశ్‌ కార్తీక్‌(6) కూడా విఫలం కావడంతో టీమిండియా 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో రిషభ్‌ పంత్‌-హార్దిక్‌ పాండ్యాల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 47 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత రిషభ్‌(32) అనవసరపు షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఆపై కాసేపటికి  పాండ్యా(32) కూడా అదే దారిలో నడవడంతో భారత్‌ 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లతో కష్టాల్లో పడింది.

ఆ దశలో ధోని-జడేజాల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించడంతో భారత్‌ గాడిలో పడింది. ఒకవైపు ధోని కుదురుగా పరుగులు చేయడానికి యత్నిస్తే, జడేజా మాత్రం దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యం సాధించడంతో భారత్‌ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. కాగా, జడేజా ఒక భారీ షాట్‌ ఆడబోయే క్రమంలో ఏడో వికెట్‌గా ఔట్‌ కాగా, స్వల్ప వ్యవధిలో ధోని రనౌట్‌ అయ్యాడు. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని సిక్స్‌ కొట్టాడు. అటు తర్వాత మరుసటి బంతికి పరుగులేమీ చేయకపోగా, మూడో బంతికి రెండు పరుగులు తీసే యత్నం చేశాడు.  అయితే కీపర్స్‌ ఎండ్‌లో ఉన్న గప్టిల్‌ నేరుగా వికెట్లను కొట్టడంతో ధోని పెవిలియన్‌ చేరాడు. ఇక అటు తర్వాత భారత్‌ కథ షరా మామూలే. 49 ఓవర్‌ చివరి బంతికి భువనేశ్వర్‌ ఔట్‌ కాగా, 50 ఓవర్‌ మూడో బంతికి చహల్‌ ఔటయ్యాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో  మ్యాట్‌ హెన్రీ మూడు వికెట్లతో భారత్‌ పతనాన్ని శాసించగా, ట్రెంట్‌ బౌల్ట్‌,సాంత్నార్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. ఫెర్గ్యుసన్‌, నీషమ్‌లకు చెరో వికెట్‌ లభించింది. అంతకుముందు న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు