అశ్విన్‌తో కలిసి అగ్రస్థానానికి

9 Mar, 2017 00:24 IST|Sakshi
అశ్విన్‌తో కలిసి అగ్రస్థానానికి

తొలిసారి టాప్‌ర్యాంకులో జడేజా

దుబాయ్‌: భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా తన కెరీర్‌లో తొలిసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంకుకు చేరుకున్నాడు. టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో సహచరుడు అశ్విన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచా డు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని నంబర్‌వన్‌ ర్యాంకుకు ఎగబాకాడు. 2008 ఏప్రిల్‌లో కూడా ఇద్దరు బౌలర్లు స్టెయిన్‌ (దక్షిణాఫ్రికా), మురళీధరన్‌ (శ్రీలంక) అగ్రస్థానాన్ని పంచుకున్నారు.

ఇద్దరు స్పిన్నర్లు  ఒకేసారి నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి. బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్‌ కోహ్లి ఒక స్థానాన్ని కోల్పోయి మూడో ర్యాంకుకు పడిపోయాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ రెండో స్థానానికి చేరాడు. చతేశ్వర్‌ పుజారా ఐదు స్థానాల్ని మెరుగుపర్చుకొని ఆరో ర్యాంకుకు, రహానే రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 15వ ర్యాంకుకు ఎగబాకారు.

ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌ స్మిత్‌ టాప్‌ ర్యాంకులో రికీ పాంటింగ్‌ రికార్డును అధిగమించాడు. పాంటింగ్‌ 76 మ్యాచ్‌ల పాటు అగ్రస్థానంలో ఉంటే స్మిత్‌ 77 మ్యాచ్‌ల పాటు టాప్‌ ర్యాంకులో నిలవడం విశేషం. ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్‌ ఆటగాడు షకీబుల్‌ హసన్‌... అశ్విన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరాడు. దీంతో అశ్విన్‌ రెండు, జడేజా మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు. 

>
మరిన్ని వార్తలు