‘డబుల్‌ సెంచరీ’తో జడేజా సరికొత్త రికార్డు

4 Oct, 2019 16:18 IST|Sakshi

విశాఖ: టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యంత వేగవంతంగా రెండొందల వికెట్ల మార్కును చేరిన ఎడమ చేతి వాటం బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డీన్‌ ఎల్గర్‌ను ఔట్‌ చేయడం ద్వారా జడేజా ఈ ఫీట్‌ను నెలకొల్పాడు. ఈ టెస్టులో ఇది జడేజాకు రెండో వికెట్‌. ఈ మ్యాచ్‌కు ముందు 198 వికెట్లతో ఉన్న జడేజా.. డానీ పీడ్త్‌, ఎల్గర్‌ వికెట్లను సాధించి ‘డబుల్‌ సెంచరీ’ కొట్టేశాడు. కాగా, ఇది జడేజా 44వ టెస్టు. ఫలితంగా అతి తక్కువ టెస్టుల్లో 200 వికెట్లను సాధించిన లెఫ్టార్మ్‌ బౌలర్‌గా గుర్తింపు పొందాడు.(ఇక్కడ చదవండి: హమ్మయ్య.. ఔట్‌ చేశాం!)

ఈ క్రమంలోనే శ్రీలంక బౌలర్‌ హెరాత్‌ రికార్డును జడేజా బ్రేక్‌ చేశాడు. అంతకముందు హెరాత్‌ రెండొందల టెస్టు వికెట్లు సాధించడానిక 47 టెస్టులు ఆడగా, ఇంకా మూడు టెస్టులు ముందుగా జడేజా దాన్ని అందుకున్నాడు. ఈ జాబితాలో జడేజా, హెరాత్‌ల తర్వాత ఆసీస్‌ మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌(49 ఇన్నింగ్స్‌లు), ప్రస్తుత ఆసీస్‌ ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌(50 ఇన్నింగ్స్‌లు)లు ఉన్నారు. ఇక భారత స్పిన్‌ దిగ్గజం బిషన్‌ సింగ్‌ బేడీ-పాక్‌ దిగ్గజం వసీం అక్రమ్‌లు 51 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ సాధించి సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు.

తాజా మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన ఎల్గర్‌ ఆరో వికెట్‌గా ఔటయ్యాడు.  ఒకవైపు దక్షిణాఫ్రికా టాపార్డర్‌లో కీలకమైన వికెట్లను భారత బౌలర్లు సాధించినప్పటికీ ఎల్గర్‌ మాత్రం పట్టువదలకుండా ఇన్నింగ్స్‌ ఆడాడు.   287 బంతులను ఎదుర్కొని 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 160 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా, 9 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు సెంచరీ సాధించిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా ఎల్గర్‌ ఘనత సాధించాడు. అంతకుముందు 2010లో భారత్‌లో ఆమ్లా సెంచరీ సాధించగా, ఇంతకాలానికి సఫారీల తరఫున ఎల్గర్‌ ఆ మార్కును చేరాడు.  అయితే ఎల్గర్‌ ఔటైన కాసేపటికి డీకాక్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో సుదీర్ఘ కాలం తర్వాత భారత్‌లో సెంచరీ చేసిన సఫారీల ఆటగాళ్ల జాబితాలో ఎల్గర్‌ సరసన డీకాక్‌ కూడా చేరిపోయాడు.

>
మరిన్ని వార్తలు