‘జడేజానే నా ఫేవరెట్‌ ప్లేయర్‌’

22 Feb, 2020 14:18 IST|Sakshi

జోహెనెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 107 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో ఆ దేశ స్పిన్నర్‌ ఆస్టన్‌ ఆగర్‌ కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్లు సాధించి సఫారీల నడ్డివిరచడంతో పాటు హ్యాట్రిక్‌ను కూడా నమోదు చేయడంతో దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. ఆగర్‌ దెబ్బకు 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 14.3 ఓవర్లలో 89 పరుగులకే చాపచుట్టేసింది. ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ నాల్గో బంతికి డుప్లెసిస్‌ను ఔట్‌ చేసిన ఆగర్‌.. ఆ తర్వాత వరుస బంతుల్లో ఫెహ్లుక్వోయో, స్టెయిన్‌లను ఔట్‌ చేసి తన కెరీర్‌లో తొలి హ్యాట్రిక్‌ను అందుకున్నాడు.(ఇక్కడ చదవండి: దక్షిణాఫ్రికా అతి పెద్ద పరాజయం)

ఇటీవల భారత్‌లో పర్యటించిన ఆసీస్‌ జట్టులో సభ్యుడైన ఆగర్‌ మూడు వన్డేల్లో కలిపి రెండు వికెట్లను మాత్రమే సాధించాడు. అయితే భారత టూర్‌కు తనను నామమాత్రంగా ఎంపిక చేయగా అది తనలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిందని ఆగర్‌ చెప్పుకొచ్చాడు. భారత పర్యటన సందర్భంగా మనం ముద్దుగా పిలుచుకునే ‘ సర్‌’రవీంద్ర జడేజాతో చేసిన చాట్‌  ఎంతగానో ఉపయోగిపడిందట. ప్రపంచ క్రికెట్‌లో తన ఫేవరెట్‌ ప్లేయర్‌ ఎవరైనా ఉన్నారంటే అది జడేజానేనని ఆగర్‌ చెప్పుకొచ్చాడు. ఫీల్డ్‌లో జడేజా చేసిన ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నాడు. తనకు కూడా జడేజాలా రాణించాలని ఉందని ఆగర్‌ పేర్కొన్నాడు. ‘ జడేజా ఒక రాక్‌స్టార్‌..ఫీల్డ్‌లో అతను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఫీల్డింగ్‌లో చురుకుదనం, బంతిని స్పిన్‌ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. నాలో ఆత్మవిశ్వాసం పెరగడానికి భారత పర్యటనతో పాటు జడేజా కూడా కారణం’ అని ఆగర్‌ పేర్కొన్నాడు. 

>
మరిన్ని వార్తలు