పీకల్లోతు కష్టాల్లో సఫారీలు

13 Oct, 2019 13:18 IST|Sakshi

పుణే: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌ ఆడుతున్న సఫారీలు 129 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్నారు. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా టాపార్డర్‌ కకావికలమైంది. సఫారీల రెండో ఇన్నింగ్స్‌లో మార్కరమ్‌ పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరితే, డీన్‌ ఎల్గర్‌(48) ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత బావుమా(38) ఫర్వాలేదనిపించాడు.  మార్కరమ్‌ను ఇషాంత్‌ ఎల్బీగా ఔట్‌ చేస్తే, డిబ్రుయిన్‌(8)ను ఉమేశ్‌ యాదవ్‌ బోల్తా కొట్టించాడు. సాహా అద్భుతమైన క్యాచ్‌తో డిబ్రుయిన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దాంతో 21 పరుగులకే సఫారీలు రెండు వికెట్లు కోల్పోగా, డుప్లెసిస్‌(5) అశ్విన్‌ ఔట్‌ చేశాడు. ఇక్కడ కూడా సాహా మరో చక్కటి క్యాచ్‌ పట్టడంతో డుప్లెసిస్‌ భారంగా పెవిలియన్‌ వీడాడు. ఆపై ఎల్గర్‌, డీకాక్‌(5),బావుమా, ముత్తుసామీ(9)లు పెవిలియన్‌ చేరారు. సఫారీలు కోల్పోయిన ఏడు వికెట్లలో అశ్విన్‌, జడేజాలు  తలో రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్‌, ఉమేశ్‌ యాదవ్‌, షమీలకు వికెట్‌ చొప్పున లభించింది.

>
మరిన్ని వార్తలు