జైకిరణ్‌కు మూడో స్థానం

16 Jul, 2018 10:29 IST|Sakshi

జాతీయ ర్యాంకింగ్‌ రెగెట్టా చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: మాన్‌సూన్‌ రెగెట్టా జాతీయ ర్యాంకింగ్‌ చాంపియన్‌షిప్‌లో షేక్‌పేట్‌ మోడల్‌ స్కూల్‌ విద్యార్థి బి. జైకిరణ్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. హుస్సేన్‌సాగర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో మూడోస్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌లో జైకిరణ్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఆదివారం ఓపెన్‌ కేటగిరీలో జరిగిన చివరి రెండు రేసుల్లో విజేతగా నిలిచిన చున్నుకుమార్‌ (త్రిష్ణ సెయిలింగ్‌ క్లబ్‌) 48 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచాడు. ఎన్‌ఎస్‌ఎస్‌ భోపాల్‌కు చెందిన ఉమా చౌహాన్‌ 53 పాయింట్లతో రజతాన్ని గెలుచుకుంది. కాంస్యాన్ని సాధించిన హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌ సెయిలర్‌ జైకిరణ్‌ 71 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. చివరి రోజు పోటీల్లో కిరణ్‌ అంచనాలకు తగ్గట్లు రాణించాడు.

బాలికల విభాగంలో ఉమా చౌహాన్‌ (53 పాయింట్లు) పసిడి పతకాన్ని గెలుచుకుంది. రితిక (104 పాయింట్లు), సంచిత పంత్‌ (120 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. మొత్తం 111 మంది సెయిలర్లు తలపడిన ఈ టోర్నీలో ఆప్టిమిస్ట్‌ గ్రీన్‌ ఫ్లీట్‌ బాలికల కేటగిరీలో సీహెచ్‌ జ్ఞాపిక ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల కార్యదర్శి బి. వెంకటేశం ముఖ్య అతిథిగా విచ్చేశారు.

మరిన్ని వార్తలు