జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పంజా

23 Jul, 2019 07:31 IST|Sakshi

యు ముంబాపై ఘనవిజయం

ప్రొ కబడ్డీ సీజన్‌–7

సాక్షి, హైదరాబాద్‌ : ప్రొ కబడ్డీ లీగ్‌ మాజీ చాంపియన్స్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఏడో సీజన్‌ను ఘనవిజయంతో ప్రారంభించింది. ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ను ఓడించి దూకుడు మీదున్న యు ముంబా ఆటలు జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ముందు సాగలేదు. సోమవారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పింక్‌ పాంథర్స్‌ 42–23 తేడాతో యు ముంబాను ఓడించింది. జైపూర్‌ జట్టు 25 రైడ్‌ పాయింట్లు, 11 టాకిల్‌ పాయింట్లతో హోరెత్తించగా... యు ముంబా 18 రైడ్‌ పాయింట్లు, 5 టాకిల్‌ పాయింట్లతో పాంథర్స్‌ను అందుకోలేకపోయింది. పాంథర్స్‌ తరపున దీపక్‌ హుడా 11 పాయింట్లతో మెరిశాడు. అతనికి నితిన్‌ (7 పాయింట్లు), దీపక్‌ (6 పాయింట్లు), అమిత్‌ హుడా (5 పాయింట్లు) చక్కని సహకారం అందించారు. యు ముంబా తరపున అభిషేక్‌ (7 పాయింట్లు), డాంగ్‌ జీన్‌ లీ (6 పాయింట్లు) పర్వాలేదనిపించారు.

దడదడలాడించిన దీపక్‌... 
ఆట ఆరంభం నుంచి దూకుడును ప్రదర్శించిన పాంథర్స్‌ ఏ దశలోనూ యు ముంబాకు కోలుకునే అవకాశాన్నివ్వలేదు. ముఖ్యంగా దీపక్‌ హుడా తన రైడ్లతో ప్రత్యర్థిని దడదడలాడించాడు. తన తొలి రెండు రైడ్లలో మూడు పాయింట్లు సాధించి జైపూర్‌కు మంచి ఆరంభాన్నిచ్చాడు. ఖాతా తెరవడానికే 4 నిమిషాల సమయం తీసుకున్న యు ముంబా ఏ దశలోనూ జైపూర్‌ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. మొదటి అర్ధ భాగం ముగిసే సరికి జైపూర్‌ 22–9 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది.  రెండో భాగంలోనూ పింక్‌ పాంథర్స్‌ ఇదే దూకుడును చివరి వరకు కొనసాగించింది. ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్‌ చేసిన పాంథర్స్‌ ఒక్క సారి కూడా ఆలౌట్‌ కాలేదు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ జట్టు 34–24తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. హరియాణా జట్టు స్టార్‌ రైడర్‌ నవీన్‌ 14 పాయింట్లతో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. మంగళవారం మ్యాచ్‌లకు విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాతో బెంగాల్‌ వారియర్స్‌; దబంగ్‌ ఢిల్లీతో తెలుగు టైటాన్స్‌ తలపడతాయి. 

మరిన్ని వార్తలు