ఈ దశాబ్దపు ఐదో బౌలర్‌గా ఘనత

26 Dec, 2019 15:58 IST|Sakshi

సెంచూరియన్‌: ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో తొలి బంతికే వికెట్‌ సాధించి ఈ దశాబ్దంలో ఆ ఫీట్‌ సాధించిన ఐదో బౌలర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.  దక్షిణాఫ్రికాతో ఆరంభమైన తొలి టెస్టులో భాగంగా ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డీన్‌ ఎల్గర్‌- మర్కరమ్‌లు ప్రారంభించారు.అయితే ఇంగ్లండ్‌ తొలి ఓవర్‌ను అండర్సన్‌ అందుకోగా స్టైకింగ్‌ ఎండ్‌లో ఎల్గర్‌ ఉన్నాడు. తొలి బంతిని అండర్సన్‌ లెగ్‌ సైడ్‌కు సంధించగా దాన్ని ఆడాలా.. వద్దా అనే సందిగ్థంలో అది కాస్తా ఎల్గర్‌ బ్యాట్‌ను తాకుతూ కీపర్‌ జోస్‌ బట్లర్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా ఎల్గర్‌ గోల్డెన్‌ డక్‌గా నిష్క్రమించగా, అండర్సన్‌ ఖాతాలో అరుదైన ఘనత చేరింది. ఇదిలా ఉంచితే, ఇది అండర్సన్‌కు 150 టెస్టు మ్యాచ్‌ కావడం మరో విశేషం.

ఈ దశాబ్దంలో టెస్టుల్లో తొలి బంతికే వికెట్‌ సాధించిన వారిలో  డేల్‌ స్టెయిన్‌(2010), సురంగా లక్మల్‌(2010), మిచెల్‌ స్టార్క్‌(2016), సురంగా లక్మల్‌(2017)లు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు వీరి సరసన అండర్సన్‌ చేరిపోయాడు. 2010లో ఇంగ్లండ్‌ ఆటగాడు ఆండ్రూ స్ట్రాస్‌ను స్టెయిన్‌ తొలి బంతికే ఔట్‌ చేయగా, అదే ఏడాది వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ను సురంగా లక్మల్‌ మొదటి బంతికే పెవిలియన్‌కు పంపాడు. ఇక 2016లో శ్రీలంక ఆటగాడు దిముత్‌ కరుణరత్నేను మిచెల్‌ స్టార్క్‌ తొలి బంతికే ఔట్‌ చేయగా, 2017లో భారత ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ను సురంగా లక్మల్‌ మొదటి బంతికి ఔట్‌ చేశాడు. ఇక్కడ సురంగా లక్మల్‌ రెండుసార్లు తన మొదటి బంతికే వికెట్లు సాధించడం విశేషం.

మరిన్ని వార్తలు