కోహ్లి అలా అంటే... అబద్ధమాడుతున్నట్లే 

24 Jul, 2018 00:35 IST|Sakshi

ఇంగ్లండ్‌ పేసర్‌ అండర్సన్‌  

లండన్‌: జేమ్స్‌ అండర్సన్‌... స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను మింగేసే ఇంగ్లండ్‌ పేస్‌ దిగ్గజం. 2014 పర్యటన సందర్భంగా విరాట్‌ కోహ్లిని నాలుగు సార్లు ఔట్‌ చేసి దారుణ వైఫల్యం అంటే ఏమిటో తనకు రుచి చూపాడు. తాజాగా భారత్‌తో సుదీర్ఘ టెస్టు సిరీస్‌ నేపథ్యంలో కోహ్లి ఫామ్, వాతావరణం ఇలా పలు అంశాలపై అతడు మాట్లాడాడు. ‘జట్టు గెలుస్తున్నంత కాలం నేను పరుగులు చేయకున్నా ఇబ్బంది లేదు’ అని టీమిండియా కెప్టెన్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించాడు. కోహ్లి అలా అని ఉంటే అతడు నిజంగా అబద్ధం ఆడుతున్నట్లేనని అండర్సన్‌ పేర్కొన్నాడు. ‘భారత్‌ ఇక్కడకు గెలవడానికే వచ్చింది. అందుకు కోహ్లి రాణించడం చాలా కీలకం. ఓ కెప్టెన్‌గా, ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా అతడి నుంచి అందరూ అదే ఆశిస్తారు. లోపాలను సరిచేసుకునేందుకు కోహ్లి తీవ్రంగా శ్రమిస్తుండవచ్చు. రానున్న సిరీస్‌లో నాతో సహా మా జట్టులోని ఇతర బౌలర్లందరికీ అతడితో పోరాటం తప్పదు. మేమంతా అందుకోసం ఉత్సాహంగా చూస్తున్నాం’ అని ఇంగ్లండ్‌ పేసర్‌ అన్నాడు. 2014 పర్యటన నుంచి కోహ్లి పాఠాలు నేర్చుకుని ఉంటాడని భావిస్తున్నట్లు వివరించాడు.  

టెస్టుల కథ వేరు... 
ఇంగ్లండ్‌లో ప్రస్తుతం ఉన్న ఎండల కారణంగా పొడిబారిన పిచ్‌లు తమ కంటే భారత బౌలర్లకు ఎక్కువ అనుకూలమని ఇది పరిశీలించాల్సిన అంశమని అండర్సన్‌ అన్నాడు. అయితే, వేసవి ముగింపునకు వస్తోంది కాబట్టి వర్షాలు కురిస్తే పచ్చిక పెరిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌పై టి20లు, వన్డేల్లో కోహ్లి ఫామ్‌ చాటుకున్నా... ఎరుపు బంతి వేగం, స్వింగ్‌ కారణంగా టెస్టులకు వచ్చేసరికి పరిస్థితి మారుతుందని వివరించాడు. ‘ఎరుపు బంతైనా, తెల్ల బంతైనా విరాట్‌ కోహ్లి  ఆలస్యంగా ఆడతాడు. దీంతో అతడికి కావాల్సినంత సమయం దొరుకుతుంది. బౌలర్లకు మాత్రం నిదానంగా ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తుంది. అయితే, టెస్టుల్లో బ్యాట్స్‌మెన్‌ ఎదురుదాడికి దిగితే బౌలర్లకు వికెట్‌ దక్కే అవకాశాలుంటాయి’ అని అండర్సన్‌ విశ్లేషించాడు. 

వారిలో ఎవరినీ ఇష్టపడను... 
డివిలియర్స్, స్టీవ్‌ స్మిత్, విలియమ్సన్, కోహ్లిలలో ఎవరు గొప్పో చెప్పడం కష్టమని అండర్సన్‌ అన్నాడు. ‘అత్యుత్తమమైన వీరందరికి బౌలింగ్‌ చేయడాన్ని నేను ఇష్టపడను. టి20ల్లో 20 బంతుల్లో 50 పరుగులు చేయడమే కాదు. టెస్టుల్లో 250 బంతుల్లో 100 పరుగులు చేయగలరు. అన్ని ఫార్మాట్లలో తేలిగ్గా కుదురుకున్న గొప్ప లక్షణమే మిగతా బ్యాట్స్‌మెన్‌ నుంచి వారిని ప్రత్యేకంగా నిలిపింది. కాబట్టి నేను దూరం నుంచి చూస్తూ వీరందరినీ ప్రపంచంలో గొప్ప బ్యాట్స్‌మెన్‌గా అభివర్ణిస్తా’ అని సరదాగా వ్యాఖ్యానించాడు.  

మరిన్ని వార్తలు