ఆటలు, ఆతిథ్యం... 

10 Apr, 2020 03:13 IST|Sakshi

మేబషి (జపాన్‌): కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ముంచెత్తిన వేళ సామాజిక దూరం పేరిట మనిషికి మనిషికి మధ్య ఎడం పెరిగిపోయింది. విదేశాల నుంచి, పొరుగు ఊరు నుంచి వచ్చిన వారిని కలిసేందుకు అయినవాళ్లు, బంధువులే ఆసక్తి చూపడం లేదు. అలాంటిది పరాయి దేశం నుంచి వచ్చిన అథ్లెట్లను కంటికి రెప్పలా కాచుకుంటున్నారు జపాన్‌ వాసులు. ప్రాక్టీస్‌ కోసం ట్రాక్‌లు, ఉండేందుకు వసతి, ఆహారం, వారి అవసరాల కోసం నిధులు సేకరిస్తూ మానవత్వాన్ని చూపిస్తున్నారు. ఆటపై మమకారంతో తమ దేశానికి తరలివచ్చిన అథ్లెట్లపై తమ ప్రేమను కురిపిస్తున్నారు ఉత్తర టోక్యోలోని మేబషి నగరవాసులు. టోక్యో ఒలింపిక్స్‌ కోసం నిరుపేద దేశమైన దక్షిణ సూడాన్‌కు చెందిన ఐదుగురు అథ్లెట్ల బృందం నవంబర్‌లో మేబషి చేరుకుంది.

ఇందులో ఒకరు కోచ్‌ కాగా... ముగ్గురు పురుష, ఒక మహిళా స్ప్రింటర్‌ ఉన్నారు. అప్పటినుంచి ఇక్కడి ట్రాక్‌లపై ప్రాక్టీస్‌ చేస్తూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. అనూహ్యంగా ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో వీరి అంచనాలు తలకిందులయ్యాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మేబషివాసులు తమ స్నేహ హస్తం అందించారు. జూలై వరకు వారు అక్కడే ఉంటూ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు తగిన ఏర్పాట్లను వారే చూసుకుంటున్నారు. మేబషివాసుల అందించిన ఆపన్నహస్తంతో ఒలింపిక్స్‌కు పూర్తి స్థాయిలో తయారయ్యే అవకాశం లభించిందని వారి ప్రేమకు కృతజ్ఞులం అని 20 ఏళ్ల స్ప్రింటర్‌ అబ్రహం మజొక్‌ మాటెట్‌ గ్యుయెమ్‌ అన్నాడు.

>
మరిన్ని వార్తలు