ఎన్నో ఆశలతో వచ్చాను.. కానీ!

13 Feb, 2018 13:48 IST|Sakshi
షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్ కీయ్ సైటో

శీతాకాల ఒలింపిక్స్‌లో డోపింగ్ ఆరోపణలు

డోపీగా తేలిన జపాన్‌ స్పీడ్ స్కేటర్ కీయ్ సైటో

నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను: సైటో

సియోల్: దక్షిణ కొరియాలో జరగుతున్న శీతాకాల ఒలింపిక్స్‌లో డోపింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. డోపింగ్ టెస్టులో విఫలమైన జపాన్‌కు చెందిన షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్ కీయ్ సైటోను ఒలింపిక్స్ నుంచి తప్పించారు. డోపింగ్ టెస్టులో విఫలమైనట్లు సోమవారం తమకు తెలిసిందని పేర్కొన్న జపాన్ అధికారులు తమ స్కేటర్ కీయ్ సైటోపై అనర్హత వేటు వేస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు. 

తొలిసారి శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గోబోతున్న ఆ స్కేటర్ నిషేధిత అసిటలోజమైడ్ ను వినియోగించినట్లు టెస్టుల్లో తేలినట్లు సమాచారం. కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ త్వరలోనే అతడిపై చర్యలు తీసుకోనుంది. ఫిబ్రవరి 4న జపాన్ నుంచి ఒలింపిక్ గ్రామానికి వచ్చిన ప్లేయర్ కీయ్ సైటోకు నిర్వహించిన డోప్ టెస్ట్ ఫలితాలు చూసి అధికారులు షాకయ్యారు. 

మరోవైపు డోపీగా తేలిన స్కేటర్ కీయ్ సైటో మాట్లాడుతూ.. డోపింగ్ చేయాలని నేనెప్పుడూ భావించలేదు. వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించాలని ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చాను. కానీ డోప్ టెస్టుల్లో విఫలమైనట్లు తెలియగానే షాక్‌కు గురయ్యాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తా. తోటి ఆటగాళ్లకు భారం అవ్వకూడదని భావిస్తున్నాను. ప్రస్తుతం జపాన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయానికి కట్టుబడి బరిలో దిగలేకపోతున్నాంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, గత జనవరి 29న అంతర్జాతీయ స్కేటింగ్ యూనియన్ (ఐఎస్‌యూ) ఈ జపాన్ స్కేటర్ కీయ్ సైటోకు నిర్వహించిన డోప్ టెస్టుల్లో నెగటీవ్‌ అని వచ్చిన విషయం తెలిసిందే.


జపాన్‌కు చెందిన షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్ కీయ్ సైటో (కుడి)

మరిన్ని వార్తలు