భారత జట్లకు చుక్కెదురు

21 May, 2018 04:41 IST|Sakshi
సాయిప్రణీత్‌, సైనా నెహ్వాల్‌

ఫ్రాన్స్‌ చేతిలో పురుషుల జట్టు... కెనడా చేతిలో మహిళల జట్టు ఓటమి

అద్భుతం జరిగితేనే నాకౌట్‌ దశకు

థామస్‌–ఉబెర్‌ కప్‌ టోర్నీ

స్టార్‌ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి గైర్హాజరీ భారత బ్యాడ్మింటన్‌ జట్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రతిష్టాత్మక థామస్‌–ఉబెర్‌ కప్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత పురుషుల, మహిళల జట్లకు అనూహ్య ఓటమి ఎదురైంది. తొలి లీగ్‌ మ్యాచ్‌లోనే ఓటమితో భారత జట్లకు నాకౌట్‌ చేరే అవకాశాలు సన్నగిల్లాయి.

బ్యాంకాక్‌: కోచ్‌ల వ్యూహాత్మక తప్పిదమో... ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేశారో గానీ భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు మూల్యం చెల్లించుకుంది. థామస్‌ కప్‌లో భాగంగా ఫ్రాన్స్‌ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1–4తో ఓడిపోయింది. సింగిల్స్‌లో అగ్రశ్రేణి షట్లర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ను... డబుల్స్‌లో మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి జంటను ఆడించకుండా విశ్రాంతి ఇవ్వడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 21–7, 21–18తో బ్రైస్‌ లెవెర్‌డెజ్‌ను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించాడు. అయితే రెండో మ్యాచ్‌లో అర్జున్‌–శ్లోక్‌ రామచంద్రన్‌ జంట 13–21, 16–21తో బాస్టియన్‌ కెర్‌సాడీ–జూలియన్‌ మాయో జోడీ చేతిలో ఓడిపోయింది.

స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో 21వ ర్యాంకర్‌ సమీర్‌ వర్మ 18–21, 22–20, 18–21తో ప్రపంచ 43వ ర్యాంకర్‌ లుకాస్‌ కోర్వీ చేతిలో ఓటమి చవిచూశాడు. దాంతో ఫ్రాన్స్‌ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో అరుణ్‌ జార్జి–సాన్యమ్‌ శుక్లా జంట 10–21, 12–21తో థోమ్‌ గికెల్‌–రోనన్‌ లాబెర్‌ ద్వయం చేతిలో ఓడిపోవడంతో ఫ్రాన్స్‌ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామ మాత్రమైన ఐదో మ్యాచ్‌లో జూనియర్‌ మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ 20–22, 21–19, 19–21తో తోమా పపోవ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. నేడు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడుతుంది. ఇదే గ్రూప్‌లో చైనా కూడా ఉంది. నాలుగు జట్లున్న ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంటాయి.  

సైనాకు షాక్‌...
ఉబెర్‌ కప్‌లో భాగంగా కెనడాతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు 1–4తో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్‌ 21–15, 16–21, 16–21తో ప్రపంచ 14వ ర్యాంకర్‌ మిచెల్లి లీ చేతిలో పరాజయం పాలైంది. గతంలో మిచెల్లితో ఆడిన రెండుసార్లూ నెగ్గిన సైనాకు ఈసారి నిరాశ ఎదురైంది. రెండో మ్యాచ్‌లో రాచెల్‌ హోండెరిచ్‌ 21–11, 21–13తో జక్కా వైష్ణవి రెడ్డిని ఓడించి కెనడాకు 2–0తో ఆధిక్యం అందించింది. మూడో మ్యాచ్‌లో మేఘన–పూర్వీషా ద్వయం 21–19, 21–15తో మిచెల్లి టాంగ్‌–జోసెఫిన్‌ వు జంటను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్‌లో బ్రిట్నీ టామ్‌ 21–11, 21–15తో శ్రీకృష్ణప్రియపై నెగ్గడంతో కెనడా 3–1 తో విజయాన్ని దక్కించుకుంది. చివరి మ్యాచ్‌లో రాచెల్‌–క్రిస్టెన్‌ సాయ్‌ ద్వయం 21–14, 21–16తో సంయోగిత–ప్రాజక్తా జంటను ఓడించి కెనడాకు 4–1తో విజయాన్ని అందించింది.

మరిన్ని వార్తలు