కరోనాతో ‘సుమో’ రెజ్లర్‌ మృతి

14 May, 2020 00:47 IST|Sakshi
జపాన్‌ సుమో రెజ్లర్‌ షోబుషి

టోక్యో: కరోనా మహమ్మారి కారణంగా జపాన్‌ యువ సుమో రెజ్లర్‌ తనువు చాలించాడు. భారీకాయం తో ప్రేక్షకుల్ని అలరించే పురాతన క్రీడ అయిన సుమో రెజ్లింగ్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న 28 ఏళ్ల షోబుషి... నెలరోజుల పాటు కరోనాతో పోరాడి బుధవారం కన్నుమూశాడు. టోక్యోలోని ‘టకడగవా సుమో స్టేబుల్‌’కు చెందిన షోబుషి వైరస్‌ దాడి కారణంగా శరీరంలోని అవయవాలు పనిచేయడం మానేయడంతో మృత్యువాత పడ్డాడు.

ఏప్రిల్‌ నాలుగు నుంచి జ్వరం, దగ్గులాంటి కరోనా లక్షణాలతో బాధపడిన షోబుషి... చివరి వరకు ఆ వ్యాధిని జయించడానికి తీవ్రంగా పోరాడాడని సుమో సంఘం చీఫ్‌ హక్కకు తెలిపాడు. జపాన్‌లో పెద్ద సంఖ్యలో సుమో రెజ్లర్లు, మాస్టర్లు కరోనా బారిన పడినట్లు ఆయన చెప్పాడు. ఈ కారణంతోనే ఈ నెల జరగాల్సిన ‘బాషో’ టోర్నీలను రద్దు చేసినట్లు పేర్కొన్నాడు. 2011లో ఫిక్సింగ్‌ ఉదంతం తర్వాత టోర్నీలు రద్దు కావడం ఇదే మొదటిసారని అన్నాడు.

మరిన్ని వార్తలు