జేసన్‌ రాయ్‌ను పక్కన పెట్టేశారు..

12 Sep, 2019 12:04 IST|Sakshi

లండన్‌:  ‘జేసన్‌ రాయ్‌.. టెస్టుల్లో నీ గేమ్‌ ఏమిటో మేమూ చూస్తాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫామ్‌ను టెస్టుల్లో కొనసాగించాలంటే అంత ఈజీ కాదు. అందులోనూ మీ దేశంలో టెస్టు ఓపెనర్‌గా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని’ అని యాషెస్‌ సిరీస్‌కు ముందు ఆసీస్‌ చేసిన సవాల్‌ ఇది. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ఆటగాడిగా ముద్ర వేసుకున్న జేసన్‌ రాయ్‌..  ఆసీస్‌ చేసిన చాలెంజ్‌గా తగ్గట్టుగానే  ఘోరంగా విఫలమయ్యాడు. యాషెస్‌ సిరీస్‌కు ముందు కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడిన అనుభవం ఉన్న రాయ్‌ పూర్తిగా విఫలయ్యాడు. ఓపెనర్‌ నుంచి కింది స్థానంలో బ్యాటింగ్‌కు దింపినా రాయ్‌ ఆకట్టుకోలేకపోయాడు. మొత్తంగా ఈ యాషెస్‌ సిరీస్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన రాయ్‌ 110 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 31 పరుగులే అతని అత్యధిక స్కోరు.

ఈ నేపథ్యంలో కీలకమైన ఐదో టెస్టుకు రాయ్‌ను పక్కనపెట్టేశారు. చివరి టెస్టు మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఇంగ్లండ్‌.. రాయ్‌కు ఉద్వాసన పలికింది. ఆల్‌ రౌండర్లకే పెద్ద పీట వేయాలని భావించిన ఇంగ్లండ్‌ యాజమాన్యం, రాయ్‌ను తప్పించింది. రెండు మార్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమైన ఇంగ్లిష్‌ టీమ్‌ ఆల్‌ రౌండర్లు క్రిస్‌ వోక్స్‌, సామ్‌ కరాన్‌లను ఎంపిక చేసింది. బెన్‌ స్టోక్స్‌ ఇప్పటికే ఆల్‌ రౌండర్‌ పాత్రను  సమర్దవంతంగా నిర్వర్తించినప్పటకీ అతను భుజం గాయం కారణంగా చివరి టెస్టులో బౌలింగ్‌ చేసే అవకాశాలు లేవు. కేవలం అతన్ని బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్న జో రూట్‌ సేన.. వోక్స్‌, కరాన్‌లు తీసుకుంది.  క్రెయిగ్‌ ఓవర్టన్‌ను కూడా ఆఖరి టెస్టు నుంచి తప్పించారు.  పేలవమైన ఫామ్‌లో ఉన్న జేసన్‌ రాయ్‌ను తప్పించడం ఆశ్చర్య కల్గించకపోయినప్పటికీ  క్రిస్‌ వోక్స్‌, సామ్‌ కరాన్‌లు ఆఖరి టెస్టులో ఎంతవరకూ ఆకట్టుకున్నారనే దానిపైనే ఇంగ్లండ్‌ విజయావకావాలు ఆధారపడి ఉన్నాయి. 2001లో చివరిసారి స్వదేశంలో యాషెస్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. మళ్లీ తమ గడ్డపై ఆ సిరీస్‌ను కోల్పోలేదు. ఒకవేళ చివరి టెస్టులో ఆసీస్‌ గెలిస్తే మాత్రం సారథిగా టిమ్‌ పైనీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటాడు.

>
మరిన్ని వార్తలు