భళారే బుమ్రా

2 Sep, 2019 01:39 IST|Sakshi
జస్‌ప్రీత్‌ బుమ్రా

హ్యాట్రిక్‌ సహా ఆరు వికెట్లు తీసిన భారత పేసర్‌

117కే కుప్పకూలిన విండీస్‌

టీమిండియాకు భారీ ఆధిక్యం  

ఔరా... బుమ్రా. తొలి స్పెల్‌లో (6–1–10–5) నిప్పులు చెరిగే     ప్రదర్శనతో  వెస్టిండీస్‌ను నిలువునా కూల్చేశాడు. అతని ‘హ్యాట్రిక్‌’ ఆతిథ్య జట్టు పతనానికి నాంది పలికింది. కనాకష్టంగా వంద పైచిలుకు పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా రెండో టెస్టులోనూ భారత జట్టు గెలుపుబాట పట్టేసింది.   

కింగ్‌స్టన్‌: భారత్‌ మూడో రోజే ఆఖరి టెస్టును శాసించే స్థితిలో నిలిచింది. భారత్‌ ఆల్‌రౌండ్‌ షోకు ప్రత్యర్థి విలవిలలాడుతోంది. విండీస్‌కు ఫాలోఆన్‌ ఇవ్వకుండా భారీ లక్ష్యంతో ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనే ఎత్తుగడతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఇక టీమిండియా గెలుపును వర్షం తప్ప ఇంకేవీ ఆపే పరిస్థితులు కనిపించడంలేదు. అంతకుముందు ఆదివారం వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 117 పరుగులే చేసి ఆలౌటైంది. భారత పేస్‌ ఎక్స్‌ప్రెస్‌  జస్‌ప్రీత్‌ బుమ్రా (6/27) హ్యాట్రిక్‌తో విండీస్‌ను కూల్చేశాడు.

షమీకి 2 వికెట్లు, ఇషాంత్, జడేజాలకు ఒక్కో వికెట్‌ దక్కాయి. హెట్‌మైర్‌ (34; 7 ఫోర్లు) చేసిన ఆ కాసిన్ని పరుగులే విండీస్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరు! దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే విండీస్‌ను ఫాలోఆన్‌ ఆడించకుండా భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. భారత్‌ కడపటి వార్తలందేసరికి 31 ఓవర్లలో 4 వికెట్లకు 57 పరుగులు చేసింది. రాహుల్‌ (6), మయాంక్‌ (4), కోహ్లి (0), పుజారా (27) ఔటయ్యారు. రహానే (12 బ్యాటింగ్‌), విహారి (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 356 పరుగుల ఆధిక్యంలో ఉంది.

రెండో రోజే గెలుపు బాట...
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆట పరుగులతో కాకుండా పతనంతో మొదలైంది. ఒకానొక దశలో అయితే... పరుగు చేయకుండానే మూడు వికెట్లు టపటపా రాలిపోయాయి. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ ఆడేందుకు వస్తున్నారా... లేక పలాయనం చిత్తగించేందుకా అన్నట్లు ఇన్నింగ్స్‌ సాగింది. చేసే పరుగులు పక్కనబెడితే... క్రీజులో నిలబడే బ్యాట్స్‌మెన్‌ కూడా విండీస్‌కు కరువయ్యాడు. టాపార్డర్‌ నుంచి ఐదో వరుస బ్యాట్స్‌మెన్‌ దాకా అందరిదీ అదే దారి! ఇందులో మొదటి ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ (10) రెండంకెల స్కోరైనా చేశాడు. అనంతరం ఆ వరుసలో భారత పేస్‌ పదునుకు ఏ ఒక్కరూ నిలబడలేకపోయారు.    

13 ఓవర్లకే సగం కూలింది...
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్‌ పేలవమైన ఆరంభాన్నిచ్చారు. మరోవైపు జస్‌ప్రీత్‌ బుమ్రా తన పేస్‌ పదును పెంచాడు. చకాచకా వికెట్లను తీశాడు. ఇన్నింగ్స్‌లో పది ఓవర్లు ముగియకముందే నాలుగు వికెట్లను తనే çపడగొట్టాడు. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో క్యాంప్‌బెల్‌ను కీపర్‌ రిషభ్‌ పంత్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. తన మరుసటి ఓవర్లో (9వ) హ్యాట్రిక్‌ దెబ్బ తీశాడు. బ్రేవో, బ్రూక్స్, ఛేజ్‌లు అతని నిప్పులు చెరిగే బంతులకు తలవంచారు. ఆ ఓవర్‌ ముగియక ముందే... 8.4 ఓవర్లలో వెస్టిండీస్‌ స్కోరెంతో తెలుసా... 13/4. బ్రాత్‌వైట్‌ కొంచెం ఆలస్యంగా ఔటయినా... నిష్క్రమించింది మాత్రం బుమ్రా బౌలింగ్‌లోనే! ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో అతను ఔట్‌ కావడంతో విండీస్‌ 22 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది.

కాసేపు నిలబడిన హెట్‌మైర్‌...
ఆదిలోనే ఐదు వికెట్లను కోల్పోయిన ఆతిథ్య జట్టు వికెట్ల పతనాన్ని లోయర్‌ మిడిలార్డర్‌లో హెట్‌మైర్, కెప్టెన్‌ హోల్డర్‌ (18) కాసేపు అడ్డుకోగలిగారు... కానీ ఒడ్డున పడేయలేకపోయారు. ఆరో వికెట్‌కు 45 పరుగులు జోడించాక హెట్‌మైర్‌ ఆటను షమీ ముగించాడు. మరో బ్యాట్స్‌మన్‌ క్రీజులోకి వచ్చి సర్దుకునేలోపే హోల్డర్‌ను కూడా బుమ్రానే ఔట్‌ చేశాడు. దీంతో 78 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. రెండో రోజు ఆటనిలిచే సమయానికి 7 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఈ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన విండీస్‌ మరో 30 పరుగులు చేసి మిగతా 3 వికెట్లు కోల్పోయింది.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 416;
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: బ్రాత్‌వైట్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 10; క్యాంప్‌బెల్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 2; బ్రేవో (సి) రాహుల్‌ (బి) బుమ్రా 4; బ్రూక్స్‌ ఎల్బీడబ్ల్యూ (బి) బుమ్రా 0; చేజ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) బుమ్రా 0; హెట్‌మైర్‌ (బి) షమీ 34; హోల్డర్‌ (సి) సబ్‌–రోహిత్‌ (బి) బుమ్రా 18; హామిల్టన్‌ (సి) కోహ్లి (బి) ఇషాంత్‌ 5; కార్న్‌వాల్‌ (సి) రహానే (బి) షమీ 14; రోచ్‌ (సి) మయాంక్‌ (బి) జడేజా 17; గాబ్రియెల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (47.1 ఓవర్లలో ఆలౌట్‌) 117.
వికెట్ల పతనం: 1–9, 2–13, 3–13, 4–13, 5–22, 6–67, 7–78, 8–97, 9–117, 10–117.
బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 10.5–3– 24–1, జస్‌ప్రీత్‌ బుమ్రా 12.1–3–27–6, మొహమ్మద్‌ షమీ 13–3–34–2, రవీంద్ర జడేజా 11.1–7–19–1.

కోహ్లి రివ్యూ... బుమ్రా హ్యాట్రిక్‌
కోహ్లి రివ్యూ పుణ్యమాని బుమ్రా భారత టెస్టు చరిత్రలో భాగమయ్యాడు. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ వేసిన ఈ పేసర్‌ రెండో బంతికి బ్రేవో, మూడో బంతికి బ్రూక్స్‌ను ఔట్‌ చేశాడు. నాలుగో బంతి చేజ్‌ ప్యాడ్లను తాకింది. ఎల్బీ కోసం అప్పీలు చేయగా అం పైర్‌ తిరస్కరించాడు. అయితే కోహ్లి రివ్యూ కోరగా చేజ్‌ వికెట్ల ముందు దొరికినట్లు రివ్యూ లో తేలింది. అంతే బుమ్రాతోపాటు, భారత శిబిరం హ్యాట్రిక్‌ ఆనందాల్లో మునిగింది.

3: టెస్టుల్లో హ్యాట్రిక్‌ తీసిన మూడో భారతీయ బౌలర్‌ బుమ్రా. గతంలో హర్భజన్‌ సింగ్‌ (ఆస్ట్రేలియాపై కోల్‌కతాలో; 2001), ఇర్ఫాన్‌ పఠాన్‌ (పాకిస్తాన్‌పై కరాచీలో; 2006) ఈ ఘనత సాధించారు.   
44: టెస్టు క్రికెట్‌లో ఇది 44వ హ్యాట్రిక్‌కాగా ఈ ఘనత సాధించిన 40వ బౌలర్‌ బుమ్రా. నలుగురు బౌలర్లు (ట్రంబుల్, జిమ్మీ మాథ్యూస్, అక్రమ్, స్టువర్ట్‌ బ్రాడ్‌) రెండుసార్లు చొప్పున హ్యాట్రిక్‌ నమోదు చేశారు.
7: భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్‌ సాధించిన ఏడో బౌలర్‌ బుమ్రా. చేతన్‌ శర్మ, కపిల్‌ దేవ్, కుల్దీప్‌ యాదవ్, షమీ వన్డే ఫార్మాట్‌లో హ్యాట్రిక్‌ తీశారు.
  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా