‘అర్జున’కు బుమ్రా, షమీ, జడేజా, పూనమ్‌

28 Apr, 2019 01:13 IST|Sakshi

బీసీసీఐ ప్రతిపాదన

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమీ, రవీంద్ర జడేజా, మహిళా స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ పేర్లను ‘అర్జున అవార్డు’కు బీసీసీఐ ప్రతిపాదించింది. శనివారం ఇక్కడ జరిగిన సమావేశంలో సుప్రీం కోర్టు నియమిత క్రికెట్‌ పాలకుల మండలి (సీఓఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుమ్రా, షమీ భారత పురుషుల జట్టు పేస్‌ దళంలో కీలకమైనవారు. జడేజా... స్పిన్‌ ఆల్‌ రౌండర్‌. అద్భుతమైన ఫీల్డర్‌. ఈ ముగ్గురికీ త్వరలో జరుగనున్న ప్రపంచ కప్‌నకు ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కింది. గత ఏడాది ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పేరును అవార్డుల కమిటీకి పంపించినా తిరస్కరణకు గురైంది. ఈసారి మాత్రం ధావన్‌ పేరును ‘అర్జున’కు ప్రతిపాదించలేదు. ఇక 27 ఏళ్ల పూనమ్‌ యాదవ్‌ మహిళల జట్టులో రెగ్యులర్‌ సభ్యురాలు. ఈమె 41 వన్డేల్లో 63 వికెట్లు, 54 టి20ల్లో 74 వికెట్లు పడగొట్టింది.  

ఫుట్‌బాల్‌ నుంచి గుర్‌ప్రీత్, జెజె... 
సీనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టు గోల్‌ కీపర్‌ గుర్‌ప్రీత్‌ సంధూ, స్ట్రయికర్‌ జెజె లాల్‌పెఖులా పేర్లను వరుసగా మూడో ఏడాది అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) అర్జున అవార్డుకు నామినేట్‌ చేసింది. జాతీయ జట్టుకు చాలా కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరికీ గత రెండేళ్లుగా అవార్డు దక్కలేదు.    

మరిన్ని వార్తలు