అందరి చూపు బుమ్రా పైనే

3 Jan, 2020 21:01 IST|Sakshi

గుహవాటి: టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. నాలుగు నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతూ బరిలోకి దిగని బుమ్రా తాజాగా శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు. దీనికి సంబంధించి  బార్సపరా స్టేడియంలో బుమ్రా బౌలింగ్‌ చేస్తున్న వీడియో ఒకటి బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఆ వీడియోలో బుమ్రా తన పదునైన పుల్‌ డెలివరితో స్టంప్స్‌ను గిరాటేయడం కనిపించింది. నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉన్న​ బుమ్రా ఎంత కఠోర శ్రమ పడ్డాడనేది వీడియోలో తెలుస్తుంది.

'బుమ్రా వేసిన డెలివరీని ఎవరైనా చూశారా.. ఎలా ఉంది అతని బౌలింగ్‌' అంటూ ట్వీట్‌ చేసింది. మరొక ట్వీట్‌లో 'బుమ్రా తన అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉన్నాడు. అతని ప్రదర్శన చూసేందుకు మీరంతా సిద్ధంగా ఉండండి' అంటూ బీసీసీఐ పేర్కొంది. రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని బుమ్రాకు జోడీగా కాంబినేషన్లను ప్రయత్నించేందుకు ఈ సిరీస్‌ కీలకంగా మరనుంది. కాగా శ్రీలంక సిరీస్‌లో నవదీప్‌ సైనీ, శార్ధూల్‌ ఠాకూర్‌లు బుమ్రాతో బౌలింగ్‌ పంచుకునే అవకాశం ఉంది. కాగా భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌లు గాయాలతో జట్టుకు దూరమవగా, మంచి ఫాంలో ఉన్న మహ్మద్‌ షమీకి ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించారు.

'బుమ్రాతో కలిసి మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడనున్నాను. అతనితో బౌలింగ్‌ పంచుకునేందుకు ఎదురు చూస్తున్నాను. బుమ్రా బౌలింగ్‌ను పరిశీలించడం ద్వారా బౌలింగ్‌లో మరిన్ని మెలుకువలు నేర్చుకుంటాను.  నాలోని బలహీనతలను అధిగమించేందుకు అతని సూచనలు వినేందుకు నాకు ఇదే మంచి అవకాశమని ' నవదీప్‌ సైనీ తెలిపాడు. ఇప్పటికే శ్రీలంక, భారత జట్లు గుహవాటికి చేరుకున్న సంగతి తెలిసిందే. మూడు టీ 20 ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ జనవరి 5 ఆదివారం బారామతి స్టేడియంలో జరగనుంది. ఇప్పటివరకు బుమ్రా తన కెరీర్లో  58 వన్డేల్లో 103 వికెట్లు, 12 టెస్టుల్లో 62 వికెట్లు, 42 టీ20ల్లో 51 వికెట్లను పడగొట్టాడు.

మరిన్ని వార్తలు