కెమెరాకు దూరంగా పడ్డ కష్టమే ఇది : బుమ్రా

22 Aug, 2018 20:46 IST|Sakshi
జస్‌ప్రీత్‌ బుమ్రా

నాటింగ్‌హామ్‌ : కెమెరాలకు కనబడకుండా చేసిన కఠోర సాధన ఫలితమే నేటి తన విజయ రహస్యమని టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అభిప్రాడ్డాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌ 203 పరుగుల తేడాతో విజయ సాధించింది. నేటి ఆటకు ముందు పేసర్‌ ఇషాంత్‌ శర్మతో కలసి బుమ్రా ముచ్చటించాడు. ఈ వీడియో లింక్‌ను బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

‘నా అరంగేట్రపు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో తొలి స్పెల్‌లోనే 10 ఓవర్లు వేశాను. ఇలా రంజీ మ్యాచ్‌ల్లో చాలా ఓవర్లు వేసేవాడిని. అదే ఇప్పుడు సాయపడుతోంది. గాయపడ్డప్పుడు నా ఫిట్‌నెస్‌, శిక్షణపై దృష్టిపెట్టాను. కోచ్‌లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ నాక్కవాల్సింది నేర్చుకున్నాను. వారంతా ఎంతో సహాయ పడ్డారు. నేను గాయపడి ఇంటికి వెళ్లినప్పుడు విశ్రాంతి తీసుకోలేదు. జిమ్‌లో కష్టపడ్డాను. చేతనైనది చేశాను. గాయంతోనే నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశాను. ఎవ్వరికీ ఏదీ అంత సులువుగా దక్కదు. చాలా కష్టపడాలి. అప్పటి కష్టమే ఇలాంటి సమయాల్లో మనకు విజయాల్ని అందిస్తుంది. ఆ రోజు మేం కెమెరాలకు దూరంగా పడిన కష్టమే నేడు ఫలితాలనిస్తోంది. తెలుపు బంతితో పోలిస్తే ఎరుపు బంతి క్రికెట్‌లో ఓర్పు, నిలకడ అవసరం. ఇంగ్లండ్‌తో నాలుగో రోజు వాటిపై దృష్టి నిలిపా’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

‘నేనెప్పుడూ మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు విసిరి బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌ విసరాలని ప్రయత్నిస్తాను. దీంతో చివర్లో వికెట్లు లభిస్తాయి. బట్లర్‌ దూకుడైన ఆటగాడు. త్వరగా నిలదొక్కుకుంటే అతడు సమస్యలు సృష్టిస్తాడు. ఇంతకు ముందు నాకు సహాయపడ్డ బలాబలాలపైనే దృష్టి సారించా. అదే బట్లర్‌ వికెట్‌ తీసేలా చేసింది. అప్పటి వరకు పాత బంతితోనూ స్థిరంగా బౌలింగ్‌ చేశాం. కొత్త బంతికి సీమ్‌ తోడైంది.’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఇక బుమ్రా ఆడిన నాలుగు టెస్టుల్లోనే రెండు సార్లు 5 వికెట్లు సాధించడం విశేషం.

మరిన్ని వార్తలు