బూమ్‌ బూమ్‌ బ్లాస్ట్‌!

27 Aug, 2019 04:35 IST|Sakshi
బుమ్రా బంతికి డారెన్‌ బ్రేవో బౌల్డ్‌

బుమ్రా అత్యద్భుత బౌలింగ్‌

రికార్డులతో అదరగొట్టిన భారత పేసర్‌  

‘ప్రపంచంలో ఎవరు వేగంగా పరుగెత్తగలరో చూద్దాం అంటూ చిరుత, శునకాల మధ్య పందెంకు రంగం సిద్ధమైంది... పోటీ ప్రారంభమైనా చిరుత మాత్రం ఒక్క అడుగు కదపకుండా తన స్థానంలోనే ఉండిపోయింది. దాంతో ప్రేక్షకులు ఏమైందంటూ నిర్వాహకులను అడిగారు. ‘అందరికంటే అత్యుత్తమమని నిరూపించుకునే ప్రయత్నం చేయడం కూడా కొన్నిసార్లు పరువు తక్కువగా భావించాలి’...
సరిగ్గా వారం క్రితం జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ ట్వీట్‌ చేశాడు. బుమ్రా ఆంతర్యం ఏమిటో స్పష్టంగా అంతు పట్టకపోయినా... కొత్తగా దూసుకొచ్చిన ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ను ఆకాశానికెత్తడం, అతడితో తనను పోలుస్తుండటంపైనే ఈ ట్వీట్‌ అని క్రికెట్‌ ప్రపంచం అర్థాన్ని అన్వయించుకుంది. ఈ ట్వీట్‌తో ‘బుల్స్‌ ఐ’ ఇమోజీ కూడా జత చేసిన బుమ్రా ఆదివారం సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించాడు. భారత అభిమానులతో సహా అంతా యాషెస్‌ ఉత్కంఠను అనుభవిస్తున్న సమయంలో తన సత్తా చూపిస్తూ అత్యద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో రికార్డులు తిరగరాశాడు. 
 

నార్త్‌ సౌండ్‌: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌... ఈ నాలుగు దేశాల్లోనే బుమ్రా టెస్టులు ఆడాడు. కానీ నాటి ఇమ్రాన్‌ ఖాన్‌ నుంచి నేటి రవిచంద్రన్‌ అశ్విన్‌ వరకు ఆసియా దిగ్గజ బౌలర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనతను అతను అందుకున్నాడు. ఈ నాలుగు దేశాల్లోనూ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డును బుమ్రా నెలకొల్పాడు. ఇవన్నీ తన తొలి పర్యటనలే కావడం విశేషం. దీనిని అందుకునేందుకు అతనికి 11 టెస్టులే సరిపోయాయి. వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌ అతని విలువేమిటో మరోసారి చూపించింది.

ఈ మ్యాచ్‌  మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 75 పరుగుల ఆధిక్యం మాత్రమే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో విజయం కోసం భారత్‌ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్యం కష్టసాధ్యమే అయినా... సొంతగడ్డపై కొంతయినా పోరాడగలదని అంతా భావించారు. కానీ మరీ ఘోరంగా ఒక సెషన్‌ లోపు కేవలం 26.5 ఓవర్లు మాత్రమే ఆడి 100 పరుగులకే జట్టు కుప్పకూలింది. ఇదంతా బుమ్రా చలవే! టెస్టుల్లో తొలిసారి బుమ్రాను ఎదుర్కొన్న విండీస్‌ బ్యాట్స్‌మెన్‌కు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే కథ ముగిసిపోయింది. బుమ్రా ‘మ్యాజిక్‌ బంతులు’ తమను దెబ్బ తీశాయంటూ ప్రత్యర్థి కెప్టెన్‌ హోల్డర్‌ వాపోయాడు.  

అవుట్‌ స్వింగర్లతో...
బంతి విసిరేందుకు తీసుకునే రనప్‌ చిన్నదే కావచ్చు... స్పీడ్‌గన్‌లో లెక్క కడితే బంతి వేగం సాధారణంగానే కనిపించవచ్చు. కానీ బుమ్రా వేసే బంతులు అంకెలకు మించి ప్రమాదకరమైనవి. ఒకనాటి అసలు సిసలు ఫాస్ట్‌ బౌలర్ల ఆలోచనా ధోరణి అతనిలో కనిపిస్తుంది. తాజా టెస్టులో అతను తన బౌలింగ్‌ దూకుడును చూపించాడు. చాలా మంది తరహాలో ఆఫ్‌ స్టంప్‌ బయటకు వేస్తూ కీపర్‌ లేదా స్లిప్‌ వైపు క్యాచ్‌ వచ్చే అవకాశం సృష్టించే ప్రయత్నం చేయలేదు. పూర్తిగా ఆఫ్‌ స్టంప్స్‌ లక్ష్యంగానే బంతులు విసిరాడు. అతని ఐదు వికెట్లలో నాలుగు క్లీన్‌బౌల్డ్‌లు ఉన్నాయంటేనే ఇది అర్థమవుతుంది.

ముఖ్యంగా గతంలో పెద్దగా వాడని ‘అవుట్‌ స్వింగర్‌’ను బుమ్రా ప్రయోగించాడు. వరల్డ్‌ కప్‌ తర్వాత ఈ సిరీస్‌కు ముందు లభించిన విరామంలో అతను దీనిపై ప్రత్యేక సాధన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ప్రసారకర్త ‘సోనీ’ అంకెల ప్రకారం కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బుమ్రా వేసిన ప్రతీ పది బంతుల్లో ఏడు అవుట్‌ స్వింగర్లే ఉన్నాయి! వెన్నునొప్పితో తొలి ఇన్నింగ్స్‌లో పూర్తి వేగంతో బౌలింగ్‌ చేయలేకపోయిన జస్‌ప్రీత్‌... రెండో ఇన్నింగ్స్‌లో స్వింగ్‌కు కొంత అనుకూలంగా కనిపించిన వాతావరణాన్ని పూర్తిగా వాడుకున్నాడు.  

8–4–7–5
బుమ్రా వేసిన 48 బంతులు విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ పాలిట బుల్లెట్లలా మారాయి. అతని తొలి ఓవర్‌ మూడో బంతిని వెంటాడి బ్రాత్‌వైట్‌ ఔట్‌ కావడంతో విండీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. బుమ్రా తర్వాతి ఓవర్లో దూసుకొచ్చిన బంతి క్యాంప్‌బెల్‌ స్టంప్స్‌ను పడగొట్టింది. మరుసటి ఓవర్లో స్లిప్‌లో కోహ్లి క్యాచ్‌ వదిలేయకపోతే మరో వికెట్‌ అప్పుడే దక్కేది. కానీ అతని నాలుగో ఓవర్లో హైలైట్‌ బంతి వచ్చింది. అద్భుతమైన స్వింగ్‌కు బ్రేవో ఆఫ్‌ స్టంప్‌ ఎగిరి ‘బండి చక్రం’లా గిరగిరా తిరిగింది!  తొలి ఐదు ఓవర్లలో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ చచ్చీ చెడి ఏడు సింగిల్స్‌ తీయగలిగారు.

కానీ కథ అంతటితో ముగియలేదు. బుమ్రా ఆరో ఓవర్‌ తొలి బంతికి హోప్‌ స్టంప్‌ బద్దలైంది. ఎంతో కొంత పోరాడగలడని భావించిన హోల్డర్‌కు కూడా బుమ్రా బంతి అర్థం కాలేదు. ఫలితం మరో సారి ఆఫ్‌స్టంప్‌పై ఎర్రబంతి దాడి!  ఇక విరామం అంటూ కోహ్లి 8 ఓవర్ల స్పెల్‌ తర్వాత ఆపడంతో ఈ తుఫాన్‌ ఆగింది. మరో అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా ఫాస్ట్‌ బౌలర్ల గడ్డపై తొలి టెస్టును సంతృప్తిగా ముగించాడు.  
5/7ఇన్నింగ్స్‌లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టిన సందర్భంలో అతి తక్కువ పరుగులు ఇచ్చిన భారత్‌ బౌలర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. 1990లో వెంకటపతిరాజు 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.  
4 బుమ్రా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది నాలుగోసారి కాగా నాలుగు వేర్వేరు జట్లపైనే సాధించాడు.  

గతంలో ఇన్‌స్వింగర్లు ఎక్కువగా వేసేవాడిని. అయితే అనుభవం వస్తున్న కొద్దీ అవుట్‌ స్వింగర్లు కూడా బాగా వేయగలననే విశ్వాసం పెరిగింది. తాజా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉంది. అయితే ఇలాంటి బంతుల కోసం చాలా కష్టపడ్డాను. ఇంకా నేర్చుకోవాలనే తపనతో ఉన్నాను. వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉండటంతో ఏదైనా భిన్నంగా ప్రయత్నించాలని మా పేసర్లు అందరం భావించాం. స్వింగ్‌కు పరిస్థితి కొంత అనుకూలంగా ఉందనిపించడంతో అలా ప్రయత్నించాం
–జస్‌ప్రీత్‌ బుమ్రా, భారత బౌలర్‌  
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు