విశ్రాంతా? వామ్మో.. నాకొద్దు: బుమ్రా

3 Jul, 2019 11:51 IST|Sakshi
బుమ్రా

బర్మింగ్‌హామ్‌ : అద్భుత బౌలింగ్‌తో అదరగొడుతున్న యార్కర్ల కింగ్‌, టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా విశ్రాంతి తీసుకునే ప్రస్తక్తే లేదని స్పష్టం చేశాడు. మంగళవారం బంగ్లాదేశ్‌ జరిగిన మ్యాచ్‌లో యార్కర్లతో రఫ్పాడించిన ఈ యువ పేసర్‌.. 4 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో బుమ్రా వేసిన రెండు వరుస బంతుల్లో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ క్లీన్‌బౌల్డ్‌ కావడం ఇన్నింగ్స్‌కే హైలైట్‌.

ఇప్పటికే కోహ్లిసేన సెమీస్‌ బెర్త్‌ ఖరారు కావడం.. భారత బౌలింగ్‌లో బుమ్రా కీలక అస్త్రం అవ్వడంతో చివరి లీగ్‌మ్యాచ్‌(శ్రీలంకతో)కు విశ్రాంతినిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో బుమ్రా ముందు ప్రస్తావించగా.. అదేం లేదని కొట్టిపారేశాడు. తాను తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్నానని, చాలా మ్యాచ్‌లు ఆడాలనే ఆకలితో ఉన్నానని స్పష్టం చేశాడు. ‘ఇది నా తొలి ప్రపంచకప్‌. నాకు ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాలని ఉంది. నేనొక అనుభవం కలిగిన బౌలర్‌ అనుకోవడంలేదు. కొన్ని మ్యాచ్‌లు ఆడనని చెప్పడం లేదు. నేనెప్పుడు ఆడటానికే ఇష్టపడుతాను. ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే ఎక్కువ సంతోషం ఉంటుంది.’ అని విశ్రాంతి తీసుకునే ఉద్దేశం లేదని తెలిపాడు. 

ఇక చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో చేసిన తప్పును గుర్తు చేస్తూ.. అప్పుడు కూడా తానేనని, కానీ రెండేళ్ల వయసు పెరిగిందన్నాడు. తన ప్రస్తుత ప్రదర్శన వెనుక తీవ్ర కసరత్తు ఉందని చెప్పుకొచ్చాడు. ఎప్పటికీ నేర్చుకోవడానికి పరితపిస్తానని, తన ఆటను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటానన్నాడు. ‘నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తాను. మైదానంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని అంచనా వేస్తూ దానికనుగుణంగా నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తాను. కొత్త బంతి, పాత బంతి, డెత్‌ ఓవర్లలో ఎలా వేయాలో సాధన చేస్తాను. బ్యాటింగ్‌ ఎవరు చేస్తున్నారు? ఎలా ఆడుతున్నారనేది నాకనవసరం. నేను కేవలం జట్టు గెలవడానికి నా పాత్ర ఏంటనేదానిపై మాత్రమే దృష్టి సారిస్తాను.’ అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు