‛స్వర్ణ’ సుందర్‌

12 Nov, 2019 04:36 IST|Sakshi

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ జావెలిన్‌ త్రోలో బంగారు పతకం

టోక్యో పారాలింపిక్స్‌కూ అర్హత

దుబాయ్‌: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్‌ త్రోయర్‌ సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. ఎఫ్‌–46 కేటగిరిలో తలపడిన అతను బంగారు పతకం సాధించాడు. దీంతో టోక్యో పారాలింపిక్‌ గేమ్స్‌కు అర్హత సంపాదించాడు. ఈ పోటీల్లో కాంస్య పతకం సాధించిన అజిత్‌ సింగ్, రింకూలకూ టోక్యో బెర్త్‌లు లభించాయి. సోమవారం జరిగిన ఈ పోటీలో సుందర్‌ ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈటెను 61.22 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. అజిత్‌ 59.46 మీటర్లతో మూడో స్థానంలో నిలువగా... రింకూకు నాలుగో స్థానం దక్కింది. 23 ఏళ్ల సుందర్‌ గుర్జర్‌ తాజా స్వర్ణంతో వరుస ప్రపంచ ఈవెంట్లలో టైటిల్‌ నెగ్గిన రెండో పారా అథ్లెట్‌గా ఘనతకెక్కాడు. అతను లండన్‌ (2017) ఈవెంట్‌లోనూ బంగారం గెలిచాడు. గతంలో దేవేంద్ర జజారియా లియోన్‌–2013, దోహా–2015 ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో పసిడి పతకాలు నెగ్గాడు. అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ నిబంధనల ప్రకారం ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.  ఎఫ్‌–56 డిస్కస్‌ త్రోలో యోగేశ్‌ కథునియా రజతం గెలిచాడు. అతను డిస్క్‌ను 42.05 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు.

మరిన్ని వార్తలు