టెస్టు క్రికెట్‌కు జయవర్ధనే గుడ్‌బై

15 Jul, 2014 01:12 IST|Sakshi
టెస్టు క్రికెట్‌కు జయవర్ధనే గుడ్‌బై

పాకిస్థాన్‌తో సిరీసే ఆఖరు
 
కొలంబో: శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ మహేల జయవర్ధనే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. ఆగస్టులో పాకిస్థాన్‌తో జరగనున్న సిరీస్ అనంతరం అతడు టెస్టుల నుంచి తప్పుకోనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే టి20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన 37 ఏళ్ల జయవర్ధనే.. వన్డేల్లో మాత్రం కొనసాగుతాడని తెలిపింది. 1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జయవర్ధనే కెరీర్‌లో145 మ్యాచ్‌లాడి 11,493 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌లతో సిరీస్‌లను కలిపితే అతని టెస్టుల సంఖ్య 149కి చేరనుంది. 18 ఏళ్లపాటు దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం తన అదృష్టమని, కఠిన నిర్ణయమే అయినా.. రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావించినట్లు జయవర్ధనే తెలిపాడు.

ఆమ్లా ‘కొత్త చరిత్ర’

గాలె: శ్రీలంక-దక్షిణాఫ్రికా మధ్య బుధవారం ప్రారంభం కానున్న తొలిటెస్టులో చరిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతం కానుంది. దక్షిణాఫ్రికా జట్టుకు తొలిసారిగా శ్వేత జాతీయేతర ఆటగాడు హషీం ఆమ్లా పూర్తిస్థాయి కెప్టెన్‌గా సారథ్యం వహించనున్నాడు.
 
 

మరిన్ని వార్తలు