ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌ ఎవరో తెలుసా?

31 Jul, 2019 13:24 IST|Sakshi

హైదరాబాద్‌ : అంతర్జాతీయ టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన బౌలర్‌ ఎవరని అడగ్గానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు టీమిండియా మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే. 1999లో పాకిస్తాన్‌పై జంబో ఈ ఫీట్‌ సాధించాడు. అయితే తొలి సారి ఈ ఘనతనందుకున్నది మ్రాతం ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ జిమ్‌లేకర్‌. 

సరిగ్గా ఇదే రోజు(జూలై 31) 1956లో జిమ్‌ లేకర్‌ ఈ రికార్డును నమోదు చేసి రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో నాడు జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ఐసీసీ ట్వీట్‌ చేసింది. జిమ్‌లేకర్‌లా ఈ ఘనతను అందుకున్న బౌలర్‌ ఎవరైనా గుర్తుకువస్తున్నారా? అని ప్రశ్నించింది. అభిమానులందరూ జంబో పేరు కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి తర్వాత అంతర్జాతీయ టెస్టుల్లో ఇప్పటి వరకు ఎవరూ ఈ ఘనతను అందుకోలేదు. డొమెస్టిక్‌ క్రికెట్‌లో మాత్రం రెక్స్‌ రాజ్‌సింగ్‌(మణిపూర్‌), దాబాషిష్‌ మొహాంతీలు ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఇక జిమ్‌ లేకర్‌ 1946 నుంచి 1959లో ఇంగ్లండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 46 మ్యాచ్‌లు ఆడిన జిమ్‌ 193 వికెట్లు పడగొట్టాడు. 19 వికెట్లు పడగొట్టిన నాటి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 16.4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 37 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మెయిడిన్‌ ఓవర్లున్నాయి. రెండో ఇన్నింగ్స్‌ 51.2 ఓవర్లు వేసి 53 పరుగులతో 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23 ఓవర్లు మెయిడిన్‌ కావడం విశేషం.

మరిన్ని వార్తలు