సుశీల్‌ ఆశలకు జితేందర్‌ దెబ్బ

24 Feb, 2020 04:21 IST|Sakshi
జితేందర్‌, సుశీల్‌

ఆసియా రెజ్లింగ్‌ పోటీల్లో 74 కేజీల విభాగంలో రజతం

ట్రయల్స్‌ లేకుండానే ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి ఎంపిక

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఆశిస్తోన్న భారత రెజ్లింగ్‌ దిగ్గజం సుశీల్‌ కుమార్‌ ఆశలకు జితేందర్‌ దెబ్బ కొట్టాడు. ఆదివారం ముగిసిన ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో జితేందర్‌ 74 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. తద్వారా మార్చి 27 నుంచి 29 వరకు కిర్గిస్తాన్‌లో జరిగే ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సుశీల్‌ కూడా 74 కేజీల విభాగంలోనే పోటీపడతాడు. ఆసియా చాంపియన్‌షిప్‌ కోసం నిర్వహించిన ట్రయల్స్‌కు సుశీల్‌ డుమ్మా కొట్టాడు. గాయం కారణంగా తాను ట్రయల్స్‌కు హాజరుకాలేనని... ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ కోసం 74 కేజీల విభాగంలో మళ్లీ ట్రయల్స్‌ నిర్వహించాలని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)ను కోరాడు.

అయితే సుశీల్‌ అభ్యర్థనను డబ్ల్యూఎఫ్‌ఐ పట్టించుకోలేదు. ఒకవేళ ఆసియా చాంపియన్‌షిప్‌లో జితేందర్‌ విఫలమైతేనే ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి మళ్లీ ట్రయల్స్‌ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అయితే జితేందర్‌ రజత పతకం గెలవడంతో ఎలాంటి ట్రయల్స్‌ లేకుండానే అతను ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ ఆదివారం ప్రకటించారు. ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో జితేందర్‌ ఫైనల్‌ చేరుకుంటే అతనికి ‘టోక్యో’ బెర్త్‌ లభిస్తుంది. సుశీల్‌కు అధికారికంగా ‘టోక్యో’ దారులు కూడా మూసుకుపోతాయి. ఒకవేళ జితేందర్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోకపోతే ఏప్రిల్‌ 30 నుంచి మే 3 వరకు బల్గేరియాలో జరిగే వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌ రూపంలో సుశీల్, జితేందర్‌లకు చివరి అవకాశం లభిస్తుంది.  

ఆదివారం జరిగిన 74 కేజీల విభాగం ఫైనల్లో జితేందర్‌ 1–3తో డిఫెండింగ్‌ చాంపియన్‌ దనియర్‌ కైసనోవ్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. 86 కేజీల విభాగంలో దీపక్‌ పూనియా, 61 కేజీల విభాగంలో రాహుల్‌ అవారె కాంస్య పతకాలు నెగ్గారు. కాంస్య పతక బౌట్‌లలో దీపక్‌ పూనియా 10–0తో అబ్దుల్‌ సలామ్‌ (ఇరాక్‌)పై, రాహుల్‌ 5–2తో మాజిద్‌ దస్తాన్‌ (ఇరాన్‌)పై గెలిచారు. సతీందర్‌ (125 కేజీలు), సోమ్‌వీర్‌ (92 కేజీలు) విఫలమయ్యారు. ఓవరాల్‌గా భారత్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో 5 స్వర్ణాలు, 6 రజతాలు, 9 కాంస్య పతకాలు సాధించింది.

దీపక్‌, రాహుల్‌

మరిన్ని వార్తలు