రూట్‌.. నీ బ్యాటింగ్‌ బోరింగ్‌: పేసర్‌ విమర్శలు

3 Dec, 2019 10:43 IST|Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ డబుల్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 441 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో రూట్‌ 226 పరుగులు చేశాడు. ఇది రూట్‌కు మూడో డబుల్‌ సెంచరీ. అయితే రూట్‌ డబుల్‌ సెంచరీపై పొగడటాన్ని పక్కనపెట్టిన వెస్టిండీస్‌ పేసర్‌ ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌.. అదీ ఒక బ్యాటింగేనా అనే అర్థం వచ్చేలా విమర్శలు చేశాడు. నీ బోరింగ్‌ బ్యాటింగ్‌ ఏమిటి అంటూ ఎద్దేవా చేశాడు. ఈ మేరకు రూట్‌ బ్యాటింగ్‌పై తన ట్వీటర్‌ అకౌంట్‌లో విమర్శలు చేశాడు. ‘ నీ బ్యాటింగ్‌ స్లోగా ఉండటం వల్లే గేమ్‌ కూడా నత్తనడకన సాగింది. ఒక బోరింగ్‌ బ్యాటింగ్‌ అది ’ అని ఎడ్వర్డ్స్‌ పేర్కొన్నాడు. కచ్చితంగా ఇంగ్లండ్‌ గెలిస్తేనే సజీవంగా సిరీస్‌ను కాపాడుకునే అవకాశం ఉన్న తరుణంలో రూట్‌ బ్యాటింగ్‌ సరిగా లేదన్నాడు.

న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆటలో భాగంగా రాస్‌ టేలర్‌(105 నాటౌట్‌), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌( 104 నాటౌట్‌)లు సెంచరీలు సాధించిన తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. కాగా, ఆ తర్వాత పిచ్‌ను అంపైర్లు కుమార ధర్మసేన, పాల్‌ విల్సన్‌లు పదే పదే పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 1-0తో గెలుచుకుంది. తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు