సచిన్‌ తర్వాత స్థానంలో రూట్‌

13 Sep, 2019 11:35 IST|Sakshi

లండన్‌:   ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ జో రూట్‌ అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. టెస్టు ఫార్మాట్‌లో పిన్న వయసులో ఏడువేల పరుగుల మైలురాయిని దాటిన మూడో ఆటగాడిగా రూట్‌ నిలిచాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రూట్‌(57) హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఫలితంగా టెస్టుల్లో 7వేల మార్కును అందుకున్న క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. అదే సమయంలో పిన్న వయసులో ఈ ఘనత సాధించిన సచిన్‌ టెండూల్కర్‌, అలెస్టర్‌ కుక్‌ల సరసని రూట్‌ చోటు సంపాదించాడు.

ఈ ఫీట్‌ను కుక్‌ 27 ఏళ్ల 346 రోజుల వయసులో సాధిస్తే, సచిన్‌ 28 ఏళ్ల 193 రోజుల వయసులో సాధించాడు. రూట్‌ 28 ఏళ్ల 256 రోజుల వయసులో ఏడు వేల టెస్టు పరుగుల్ని సాధించాడు.  ఇక ఆల్‌ టైమ్‌ టెస్టు పరుగుల జాబితాలో ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు సర్‌ బ్రాడమన్‌ను రూట్‌ అధిగమించాడు. తన కెరీర్‌లో బ్రాడమన్‌ 6,996 పరుగులు సాధిస్తే, దాన్ని రూట్‌ బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌(15,921) తొలి స్థానంలో ఉన్నాడు. మరొకవైపు 86వ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న రూట్‌.. వేగవంతంగా అత్యధిక టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన నాల్గో ఇంగ్లండ్‌ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఇది రూట్‌ 158 టెస్టు ఇన్నింగ్స్‌ కాగా, తన టెస్టు కెరీర్‌లో 45వ హాఫ్‌ సెంచరీ సాధించాడు.

>
మరిన్ని వార్తలు