ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ

21 Aug, 2018 11:40 IST|Sakshi

నాటింగ్‌హామ్‌: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత జేమ్స్ ఆండర్సన్ ఓవర్‌లో బెయిర్‌స్టో ఎడమ చేతి వేలికి గాయమైంది.

గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జట్టు మేనేజ్‌మెంట్ అతడిని వెంటనే మైదానం నుంచి పంపించి వేసింది. అనంతరం అతడి స్థానంలో జోస్ బట్లర్ వికెట్‌ కీపింగ్ బాధ్యతలు స్వీకరించాడు. గాయపడ్డ బెయిర్‌స్టోకి ప్రస్తుతం నాటింగ్‌హామ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బెయిర్‌ స్టో వేలికి ఎక్స్‌రే తీసిన తర్వాత అతను తదుపరి మ్యాచ్‌లో కొనసాగించాలా లేదా అన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

మూడో టెస్టులో టీమిండియా.. 521 పరుగుల అసాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌కు నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి (103; 10 ఫోర్లు) టెస్టుల్లో 23వ సెంచరీతో చెలరేగగా...  పుజారా (72; 9 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా (52 బంతుల్లో 52 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు.  భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. గెలుపు కోసం ఇంగ్లండ్‌ మరో 498 పరుగులు అవసరం కాగా, భారత్‌ విజయం సాధించాలంటే పది వికెట్లు సాధించాల్సి ఉంది.

చదవండి: కోహ్లిని దాటేశాడు..

>
మరిన్ని వార్తలు