పక్షి కంటే చురుగ్గా.. చిరుత కంటే వేగంగా!

8 Mar, 2019 17:57 IST|Sakshi

హైదరాబాద్‌: క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరంటే ఏమాత్రం తడుముకోకుండా చెప్పే పేరు జాంటీ రోడ్స్‌. ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ మైదానంలో పక్షిలా రివ్వున ఎగురుతూ.. చిరుత కంటే వేగంగా కదులుతూ.. కళ్లు చెదిరేరీతిలో ఫీల్డింగ్‌ చేయడం అతడి సొంతం. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోనే కాదు ఫీల్డింగ్‌తోను జట్టుకు విజయాలను అందించవచ్చని పలుమార్లు నిరూపించాడు. తన మెరుపులాంటి ఫీల్డింగ్‌తో దక్షిణాఫ్రికాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. తరం మారినా ఇప్పటికీ ఫీల్డింగ్‌ అంటే గుర్తుకొచ్చే పేరు రోడ్స్‌ అంటే అతిశయోక్తి కాదు. తాజాగా జాంటీ రోడ్స్‌ కళ్లుచెదిరే ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియోను తాజాగా ఐసీసీ షేర్‌ చేసింది. ఈ వీడియోను క్రికెట్‌ అభిమానులు మళ్లీ మళ్లీ ప్లే చేసి చూస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  ప్రస్తుతం ఐసీసీ షేర్‌ చేసిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తుండగా.. క్రికెట్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 


27 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున.. ప్రపంచకప్‌-1992లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జాంటీ​ రోడ్స్‌ చేసిన రనౌట్‌ మ్యాచ్‌ స్వరూపానే మార్చేసింది. ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడుతుండగా.. పాక్‌ బ్యాట్స్‌మన్‌ ఇంజమాముల్‌ హక్‌ ఆడిన బంతిని రోడ్స్‌ చురుగ్గా అందుకొని చిరుత కంటే వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేసి ఔట్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఇంజమామ్‌ షాక్‌కు గురికాగా.. సఫారీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన పాక్‌కు వాతావరణం, అదృష్టం కలిసిరాలేదు. వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను కాసేపు ఆపిన అంపైర్లు.. అనంతరం ఓవర్లను కుదించి పాక్‌ లక్ష్యాన్ని 36 ఓవర్లలో 193 పరుగులకు సెట్‌ చేశారు. మంచి ఫామ్‌లో ఉన్న ఇంజమామ్‌ను రోడ్స్‌ ఔట్‌ చేయడంతో ఆ ప్రభావం పాక్‌పై తీవ్రంగా పడి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ రనౌట్‌తోనే జాంటీ రోడ్స్‌ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు