మళ్లీ అతడే అడ్డుకున్నాడు

8 Sep, 2017 00:41 IST|Sakshi
మళ్లీ అతడే అడ్డుకున్నాడు

ఫెడరర్‌ ఆట ముగించిన డెల్‌పొట్రో
క్వార్టర్స్‌లో స్విస్‌ స్టార్‌పై అద్భుత విజయం
సెమీస్‌లో నాదల్‌తో ఢీ
యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ  


యూఎస్‌ ఓపెన్‌లో వరుసగా 5 సార్లు టైటిల్‌ గెలిచి ఊపు మీదున్న  ఫెడరర్‌ను 2009 ఫైనల్లో డెల్‌పొట్రో అడ్డుకున్నాడు. డెల్‌పొట్రో కెరీర్‌లో అది ఏకైక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కాగా... ఆ తర్వాత ఫెడరర్‌ మళ్లీ యూఎస్‌ ఓపెన్‌ గెలవలేకపోయాడు. ఈ ఏడాది అద్భుత ఫామ్‌తో మూడో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌పై కన్నేసిన ఫెడెక్స్‌ ఎనిమిదేళ్ల తర్వాత కూడా అదే అర్జెంటీనా స్టార్‌ చేతిలో చావుదెబ్బ తిన్నాడు. ప్రత్యర్థి జోరు ముందు నిలవలేక, నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోలేక  క్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించాడు.

తొలి రెండు రౌండ్‌లలో ఫెడరర్‌ ఐదు సెట్ల పాటు శ్రమించి నెగ్గడంతోనే అతని ఆట, ఫిట్‌నెస్‌పై సందేహాలు కనిపించాయి. తర్వాతి రెండు మ్యాచ్‌లలో మెరుగ్గా ఆడినా... డెల్‌పొట్రో ముందు నిలవడం కష్టమని అనిపించింది. చివరకు అదే జరిగింది. ప్రత్యర్థి జోరుతో పాటు స్వీయ తప్పిదాలు టెన్నిస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌కు మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అవకాశాన్ని చేజార్చాయి. ఫలితంగా యూఎస్‌ ఓపెన్‌లో ప్రత్యర్థులుగా తొలిసారి ఫెడరర్, రాఫెల్‌ నాదల్‌ ఆట చూడవచ్చని భావించిన అభిమానులకు నిరాశ తప్పలేదు.   

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్, 19 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) కథ ముగిసింది. 2017లో మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఫెడరర్‌కు మరో మాజీ విజేత  డెల్‌పొట్రో (అర్జెంటీనా) క్వార్టర్‌ ఫైనల్లో షాక్‌ ఇచ్చాడు. 2 గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 2009 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్, 28 ఏళ్ల డెల్‌పొట్రో 7–5, 3–6, 7–6 (10/8), 6–4తో ఫెడరర్‌ను చిత్తు చేశాడు. సెమీఫైనల్లో నంబర్‌వన్‌ నాదల్‌ (స్పెయిన్‌)తో డెల్‌పొట్రో తలపడతాడు. క్వార్టర్స్‌లో నాదల్‌ 6–1, 6–2, 6–2తో రుబ్లేవ్‌ (రష్యా)పై అలవోకగా నెగ్గాడు. 28 ఏళ్ల డెల్‌పొట్రో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో సెమీస్‌కు చేరడం ఇది నాలుగోసారి మాత్రమే. 2009 యూఎస్‌ ఓపెన్‌ సెమీస్‌లోనూ అతను నాదల్‌ను ఓడించడం విశేషం.  

స్వయంకృతం...
వరుస గాయాలతో పాటు మణికట్టుకు నాలుగు సర్జరీలతో దాదాపుగా ఆటకు దూరమైన డెల్‌పొట్రో ఈసారి తన సత్తా చాటాడు. ఈ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఫెడరర్‌కు 16–5తో డెల్‌పొట్రోపై మెరుగైన రికార్డు ఉంది. అయితే ఇప్పుడు మాత్రం పొట్రో ఎక్కడా తగ్గలేదు. భారీ సర్వీస్‌లు, పదునైన ఫోర్‌హ్యాండ్‌లతో అతను విరుచుకు పడ్డాడు. పోటాపోటీగా సాగిన తొలి సెట్‌లో ఫెడరర్‌ ఓడినా రెండో సెట్‌లో అతడికి ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. అయితే మూడో సెట్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ సెట్‌ టైబ్రేక్‌లో ఫెడరర్‌కు నాలుగుసార్లు సెట్‌ పాయింట్లు లభించినా ఫలితం లేకపోయింది. నాలుగో సెట్‌లో ఒక దశలో స్కోరు 2–2తో సమంగా నిలిచినా... ఈ దశలో ఫెడరర్‌ పేలవమైన ఆటతీరు కనబర్చడంతో మ్యాచ్‌ చేజారిపోయింది. ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ ఏకంగా 41 అనవసర తప్పిదాలు చేయగా... అందులో 22 తప్పిదాలు ఫోర్‌హ్యాండ్‌ ద్వారానే జరిగాయి.    

ఆల్‌ అమెరికా...
మహిళల సింగిల్స్‌ విభాగంలో 1981 తర్వాత మొదటిసారి నలుగురు అమెరికా క్రీడాకారిణులే సెమీఫైనల్లో తలపడనున్నారు. వీనస్‌ విలియమ్స్, స్లోన్‌ స్టీఫెన్స్, కోకో వాండవె ఇప్పటికే సెమీస్‌ చేరగా... మాడిసన్‌ కీస్‌ వారితో జత కలిసింది. క్వార్టర్‌ ఫైనల్లో మాడిసన్‌ కీస్‌ 6–3, 6–3 స్కోరుతో కయీ కనెపి (ఎస్తోనియా)పై విజయం సాధించింది. 36 ఏళ్ల క్రితం యూఎస్‌ ఓపెన్‌ మహిళల సెమీస్‌లో అమెరికాకే చెందిన మార్టినా నవ్రతిలోవా, క్రిస్‌ ఎవర్ట్, ట్రేసీ అస్టిన్, బార్బా పొటర్‌ తలపడ్డారు. మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ సానియా మీర్జా (భారత్‌)–షుయె పెంగ్‌ (చైనా) ద్వయం 7–6 (7/5), 6–4తో ఐదో సీడ్‌ తిమియా బాబోస్‌ (హంగేరి)–ఆండ్రియా హలవకోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంటను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.   

ప్రస్తుతం నేను ఆడిన లేదా ఆడుతున్న తీరు ఈ టోర్నీ గెలిచేందుకు సరిపోదు. నేను నిష్క్రమించడమే మంచిదైంది. నాకన్నా మెరుగైన వ్యక్తి టైటిల్‌ సాధిస్తాడు. నాకు సెమీస్‌ చేరే అర్హత లేదు. బయటకు కనిపిస్తున్న దానికంటే కూడా నా ఆట బలహీనంగా ఉంది. టోర్నీ ఆరంభం నుంచీ ఇబ్బంది పడ్డాను. గట్టి ప్రత్యర్థి ఎదురైతే కష్టమని అనిపించింది కూడా. ఓటమి నుంచి కోలుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు. అయితే ఈ ఏడాది సంతృప్తిగా గడిచిందనే చెప్పగలను. ఇక సెమీఫైనల్‌ గురించి నిజాయతీగా మాట్లాడాలంటే నాదల్‌ను ఓడించే అవకాశం డెల్‌పొట్రోకు ఉంది.      
– ఫెడరర్‌

టోర్నమెంట్‌లో నేను నా అత్యుత్తమ మ్యాచ్‌ ఆడాను. సర్వీస్‌ బాగా చేశాను. నా ఫోర్‌హ్యాండ్‌ కూడా పని చేసింది. కచ్చితంగా గెలిచే అర్హత నాకు మాత్రమే ఉంది. గాయాలు, శస్త్ర చికిత్సల తర్వాత నాకెంతో ఇష్టమైన టోర్నీలో మళ్లీ సెమీస్‌ ఆడగలనని ఏమాత్రం ఊహించలేదు. ఇది నా సొంత కోర్టులాంటిదే. మరోసారి నాదల్‌ను ఓడించగలనని నమ్ముతున్నా. అతను ప్రస్తుతం నంబర్‌వన్‌ అయినా టెన్నిస్‌లో ఏదైనా సాధ్యమే.                               
– డెల్‌పొట్రో 

మరిన్ని వార్తలు