కోహ్లికి స్మిత్‌ ఏమాత్రం తీసిపోడు

7 Aug, 2019 07:46 IST|Sakshi

ఆస్ట్రేలియా కోచ్‌ లాంగర్‌

బర్మింగ్‌హామ్‌: యాషెస్‌ తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు కొట్టిన స్టీవ్‌ స్మిత్‌ను ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఆకాశానికెత్తాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి స్మిత్‌ ఏమాత్రం తీసిపోడని అన్నాడు. స్పిన్నర్‌గా కెరీర్‌ ప్రారంభించిన స్మిత్‌... ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎదిగిన తీరును ప్రస్తావించాడు. తీవ్ర ఒత్తిడిలో చెక్కుచెదరని సంకల్పం, ధైర్యం, ఏకాగ్రతతో చేసిన తాజా సెంచరీలు స్మిత్‌ను మరో మెట్టు ఎక్కించాయన్నాడు. ఇది కేవలం గొప్ప ఆటగాళ్లకే సాధ్యమని లాంగర్‌ కొనియాడాడు. స్మిత్‌ను నెట్స్‌లోనూ ఔట్‌ చేయడం సాధ్యం కాదని... ఈ విషయం ఇంగ్లండ్‌ ఆటగాళ్లను అడిగితే చెబుతారని అన్నాడు.

మూడో ర్యాంక్‌కు స్మిత్‌...
స్టీవ్‌ స్మిత్‌ టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 3లోకి వచ్చాడు. తాజాగా ప్రకటించిన జాబితాలో అతడు 903 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా (881) నాలుగో స్థానానికి పడిపోయాడు. యాషెస్‌ తొలి టెస్టుకు ముందు స్మిత్‌ 857 పాయింట్లతో నాలుగో ర్యాంకులో ఉండటం గమనార్హం. ఈ జాబితాలో కోహ్లి (922 పాయింట్లు), కేన్‌ విలియమ్సన్‌ (913) తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు